హారీష్‌రావుపై జగ్గారెడ్డి అనుచిత వ్యాఖ్యలు

By అంజి  Published on  20 Jan 2020 4:37 AM GMT
హారీష్‌రావుపై జగ్గారెడ్డి అనుచిత వ్యాఖ్యలు

సంగారెడ్డి: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై కేసు నమోదైంది. రాష్ట్ర మంత్రి, టీఆర్‌ఎస్‌ నేత హారీష్‌రావుపై మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో జగ్గారెడ్డి అసభ్యకర వ్యాఖ్యలు చేశారని మాజీ ఎమ్మెల్సీ ఆర్‌. సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు జగ్గారెడ్డిపై 153a, 188, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మంత్రి హారీశ్‌ రావుకు వస్తున్న ఆదరణను చూసి జగ్గారెడ్డి ఓర్వలేకపోతున్నారని మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ మండిపడ్డారు. ఓటర్ల సానుభూతి కోసం ఈ విధంగా మాట్లాడారని ఆరోపించారు.

మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు ఓటమి తప్పదన్నారు. తులసి వనంలో గంజాయి మొక్కగా జగ్గారెడ్డి మారరన్నారు. సంగారెడ్డికి తలవంపులు తెచ్చే విధంగా జగ్గారెడ్డి అనాగరికంగా మాట్లాడారని, ఈ సందర్భంగా జగ్గారెడ్డి అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని ఆర్‌.సత్యనారాయణ ప్రజలకు పిలుపునిచ్చారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టి బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. సదాశివపేటలో జగ్గారెడ్డి కూతురు ప్రచారానికి వెళ్తే ఓటర్లు నిలదీస్తున్నారని పేర్కొన్నారు. పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తే సానూభూతి లభిస్తుందని జగ్గారెడ్డి భ్రమపడుతున్నారని అన్నారు. సంగారెడ్డి జిల్లాలో హారీశ్‌రావుకు ప్రజలు బ్రహ్మరథం పట్టినట్లు చెప్పారు.

Next Story
Share it