సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం
By సుభాష్ Published on 23 Aug 2020 7:04 AM ISTసంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుమ్మడిదల మండలం దోమడుగులోని సాల్వంట్ రసాయన పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో దట్టమైన పొగలు అలుముకుని మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్నఅగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు.
అయితే ఈ ప్రాంతంలో అధికంగా కెమికల్ ఫ్యాక్టరీలు ఉండటంతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అలాగే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది.. ఎంత నష్టం వాటిల్లిందనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
కాగా, ఈ మధ్యన తెలుగు రాష్ట్రాల్లో భారీగానే అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సిబ్బంది నిర్లక్ష్యం, షాట్ సర్య్కూట్ కారణంగా ఎన్నో అగ్నిప్రమాదాలు చోటు చేసుకుని అమాయకుల ప్రాణాలు మంటల్లో ఆహుతైపోతున్నాయి. పరిశ్రమల్లో సరైన జాగ్రత్తలు పాటించకపోవడం కారణంగా అగ్ని ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడే అధికారులు జాగ్రత్తల గురించి చెబుతూ హడావుడి చేస్తున్నారే తప్ప తర్వాత పట్టించుకోవడం లేదు.