కుక్క కోసం 7లక్షలు ఖర్చు...
By జ్యోత్స్న Published on 22 Dec 2019 11:31 AM ISTపెంపుడు జంతువులను ప్రేమించేవారిని అక్కడక్కడా చూస్తుంటాం. వాటిని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన వాళ్లు కూడా ఉంటారు. వాటికి ఏమైనా జరిగితే వారు విలవిల్లాడిపోతారు. సరిగ్గా అలాంటి వ్యక్తే ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. సాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఎమిలీ టాలెర్మో అనే మహిళ ఆస్ట్రేలియన్ షెఫర్డ్ డాగ్‌ను పెంచుకుంటోంది. దాని పేరు జాక్సన్. గత వారం ఓ షాప్ నుంచి వస్తుండగా ఆ కుక్క కనిపించకుండా పోయింది.
అప్పటి నుంచి ఎమిలీ తన స్నేహితులతో కలిసి కుక్కను వెతికినా.. ఎంతకీ దాని ఆచూకీ లభించకపోవడంతో కావాలనే ఎవరో దాన్ని అపహరించి ఉంటారని భావించి దాన్ని వెతకడానికి ఒక ఉపాయాన్ని ఆలోచించింది.కుక్కను వెతికి ఇచ్చిన వారికి 7 వేల డాలర్లు అంటే సుమారు రూ. 5 లక్షల నజరానాను ప్రకటించింది. అంతేగాక కుక్కను వెతకడానికి సహాయంగా ఓ విమానాన్ని సైతం అద్దెకు తీసుకుంది. విమాన ఖర్చులకు అదనంగా 1200 డాలర్లను అంటే సుమారు మరో లక్ష వరకూ కేటాయించింది.
ఇదిలా ఉంటే గ్రాసరీ స్టోర్ వద్ద ఉన్న కెమెరాను పరిశీలించగా ఒక వ్యక్తి దాన్ని అపహరించడం కనిపించింది. అయితే ఎవరా వ్యక్తి అనేది మాత్రం తెలియలేదు. ముఖానికి ముసుగు తొగడంతో ఆ వ్యక్తి ఎవరో ఎమిలీ గుర్తు పట్టలేకపోతోంది. అన్నట్టు కుక్కని వెతకడం కోసం విమానం శాన్‌ఫ్రాన్సిస్కో ఓక్లాండ్ మీదుగా రోజుకు రెండు గంటల పాటు ఎగురుతుందట. మరోవైపు కుక్క అదే జాక్సన్ ఆచూకీ కనుగొనేందుకు ఖర్చు ఎక్కువ అవుతుండటంతో గోఫౌండ్‌మి అనే వెబ్‌సైట్‌ను లాంచ్ చేసింది. దీని ద్వారా విరాళాలు సేకరిస్తోంది ఎమిలీ. ఇప్పటి వరకు 7వేల డాలర్లు సేకరించింది. ఒకవేళ డబ్బులు మిగిలితే అది రాకెట్ డాగ్ రెస్క్యూకు ఇస్తానని వెల్లడించింది.