మ‌రోమారు విజృంభించిన‌ ద్ర‌విడ్ త‌న‌యుడు.. 146 బంతుల్లోనే..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Feb 2020 2:55 PM GMT
మ‌రోమారు విజృంభించిన‌ ద్ర‌విడ్ త‌న‌యుడు.. 146 బంతుల్లోనే..

మిస్ట‌ర్ డిపెండ‌బుల్‌, ఒక‌ప్ప‌టి టీమిండియా 'వాల్‌' రాహుల్ ద్రవిడ్ త‌న‌యుడు సమిత్ ద్రవిడ్ మ‌రోమారు రెచ్చిపోయాడు. అండ‌ర్‌-14 క్రికెట్‌లో రెండు నెలల్లో రెండు డబుల్ సెంచరీలు బాది తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా నిరూపించుకున్నాడు. మాల్యా అదితి ఇంటర్నేషనల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సమిత్.. బీటీఆర్ షీల్డ్ అండర్-14 గ్రూప్ 1, డివిజన్ 2 టోర్నమెంటులో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో బౌండ‌రీల‌తో ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుపై విరుచుకుప‌డ్డాడు.

సమిత్.. కేవ‌లం 146 బంతుల్లో 33 బౌండరీల సాయంతో డబుల్ సెంచరీ మైలురాయిని అందుకున్నాడు. గ‌త నెల‌లో కూడా డ‌బుల్ బాదిన‌ సమిత్‌‌కు.. ఇది వ‌రుస‌గా రెండో డబుల్ సెంచరీ. సమిత్ రాణించ‌డంతో మాల్యా అదితి ఇంటర్నేషనల్ స్కూల్ నిర్ణీత 50 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది. అనంత‌రం 378 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన శ్రీ కుమరన్ చిల్డ్రన్స్ అకాడమీ 110 పరుగులకే ఆలౌటైంది. బ్యాటింగ్‌లో విజృంబించిన‌ సమిత్.. బౌలింగ్‌లోనూ రాణించి రెండు వికెట్లు పడగొట్టాడు.

గతేడాది డిసెంబరులో జ‌రిగిన‌ అండర్-14 ఇంటర్ జోనల్ టోర్నమెంటు ద్వారా వెలుగులోకి వ‌చ్చిన స‌మిత్‌.. త‌ర్వాత కూడా ప‌లు మ్యాచ్‌ల్లో రాణించి వార్త‌ల్లో నిలుస్తున్నాడు. ఆ మ్యాచ్‌లో సమిత్.. 256 బంతులు ఎదుర్కొని 22 ఫోర్లు సాయంతో 201 పరుగులు చేయ‌డంతో పాటు బౌలింగ్‌లోనూ మూడు వికెట్లు తీశాడు. అనంత‌రం రెండో ఇన్నింగ్స్‌లోనూ 94 పరుగులతో అజేయంగా నిలిచిన‌ప్ప‌టికి.. ఆ మ్యాచ్‌లో సమిత్ జట్టు ఓటమి పాలైంది. కానీ సమిత్ ప్రదర్శనపై దేశ‌వ్యాప్తంగా ప్రశంసల జ‌ల్లు కురిసింది.

Next Story