ఇదే పరిస్థితి నవంబరు దాకా కంటిన్యూ అయితే ఏమవుతుంది?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Jun 2020 8:08 AM GMT
ఇదే పరిస్థితి నవంబరు దాకా కంటిన్యూ అయితే ఏమవుతుంది?

ఫిబ్రవరిలో మొదలైన కరోనా పంజా.. మార్చి నాటికి కాస్తంతగానే కనిపించింది. మొదట్లోనే కరోనాపై లాక్ డౌన్ అస్త్రాన్ని సంధించటంతో ఏప్రిల్ వరకూ కేసుల వ్యాప్తి పెద్దగా లేదనే చెప్పాలి. ఎప్పుడైతే వలసకార్మికుల విషయంలో కేంద్రం ఫెయిల్ అయ్యిందో అప్పటినుంచి కేసుల తీవ్రత అంతకంతకూ పెరిగిపోతూ ఉంది. దీనికి తోడుగా లాక్ డౌన్ సడలింపులతో పాటు.. అన్ లాక్ 1.0 పాజిటివ్ కేసుల తీవ్రతను మరింత పెంచింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. రానున్న రోజుల్లో పరిస్థితి ఏమిటన్నది అసలు ప్రశ్న.

కరోనా ఎల్లకాలం ఉండదని.. త్వరలోనే వ్యాక్సిన్ వస్తుందన్న మాటను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ లాంటివారు చెబుతుంటే.. ప్రముఖ వైద్యులు డాక్టర్ గురవారెడ్డి లాంటివారు మాత్రం వచ్చే ఫిబ్రవరి వరకూ ఇలాంటి పరిస్థితే ఉంటుందని తేల్చేస్తున్నారు. ఏది ఏమైనా రానున్న మూడు.. నాలుగు నెలల్లో వ్యాక్సిన్ వచ్చే అవకాశమేలేదు. అదే సమయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రజలు అలాంటివేమీ తమలో లేవన్న విషయాన్ని తమ చేతలతో ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు.

ఆదివారం వచ్చిందంటే చాలు.. చికెన్.. మటన్ దుకాణాల వద్ద పోటెత్తుతున్న దుస్థితి. ఇలాంటివేళ.. కేసుల నమోదు అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఇలాంటి పరిస్థితే నవంబరు వరకు కొనసాగితే ఏమవుతుంది? ఎలాంటి పరిస్థితి ఉంటుంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. రానున్న రోజుల్లో పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుందని చెబుతున్నారు. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఏర్పాటు చేసిన పరిశోధకులు పలువురు తాజా అధ్యయాన్ని నిర్వహించారు. వారి అంచనాల ప్రకారం లాక్ డౌన్ కారణంగా వైరస్ వ్యాప్తి గరిష్ఠ స్థాయికి చేరుకోవటానికి 36 నుంచి 76 రోజుల ఆలస్యమైందని చెప్పారు.

ఇన్ ఫెక్షన్ రేటు తగ్గించటానికి లాక్ డౌన్ సాయం చేసినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో నవంబరు నాటికి గరిష్ఠ స్థాయికి చేరుకుంటామంటున్నారు. అదే జరిగితే.. నవంబరు తర్వాత ఐసీయూ పడకలు.. వెంటిలేటర్లు.. సరిపోకపోవచ్చన్న మాటను వారుచెబుతున్నారు. ఇప్పటికి అందుబాటులో ఉన్న ప్రజారోగ్య వ్యవస్థను 80 శాతం పెంచి ఉంటే.. కరోనాని ఎదుర్కొనే సామర్థ్యం మరింత పెరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం దేశంలో 21,494 వెంటిలేటర్లు ఉండగా.. మరో 60,848కి ఆర్డర్లు ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే.. ఈ సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు.. ఆక్సిజన్ బెడ్స్ ను కూడా భారీగా సమకూర్చుకోవాల్సిందే. లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉందని చెప్పక తప్పదు.

Next Story