హాజీపూర్, సమత కేసుల తుది తీర్పు వాయిదా
By సుభాష్ Published on 27 Jan 2020 4:58 PM ISTతెలంగాణలో హాజీపూర్ అత్యాచారం, హత్య, అలాగే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్‌లో సమత అత్యాచారం, హత్య కేసులు సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసుల్లో సోమవారం తుది తీర్పు వెలువడాల్సి ఉండగా, వాయిదా పడ్డాయి. ఈ కేసుల్లో ఎలాంటి తీర్పు వస్తుందోనని రాష్ట్ర ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూశారు. కాగా, సమత కేసు తుది తీర్పు జనవరి 30వ తేదీకి వాయిదా వేయగా, హాజీపూర్ కేసు ఫిబ్రవరి 6కు వాయిదా పడింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్‌కు చెందిన ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారం, హత్య జరిగింది. ఈ కేసులో నిందితుడిగా తేలిన శ్రీనివాస్ రెడ్డిని విచారణ చేస్తూ వచ్చారు. శ్రీనివాస్‌రెడ్డినే అత్యాచారం చేసి, హతమార్చినట్లు నల్గొండ కోర్టులో అభియోగాలు మోపారు. అలాగే బాలికల పోస్టుమార్టం రిపోర్టు, డీఎన్‌లో రిపోర్టు, పోలీసుల దర్యాప్తులు లభ్యమైన కీలక ఆధారాలను జత చేసి కోర్టుకు సమర్పించారు.
జడ్జిమెంట్ కాపీ సిద్ధంగా లేకపోవడంతోనే..
ఇక హాజీపూర్ హత్య కేసుల్లోనూ పోక్సో ప్రత్యేక న్యాయస్థానం ఫిబ్రవరి 6కు వాయిదా పడింది. జడ్జిమెంట్ కాపీ సిద్ధంగా లేకపోవడంతో కేసు వాయిదా పడినట్లు తెలుస్తోంది. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని తిరిగి నల్గొండ జిల్లా జైలుకు తరలించారు.
300 మంది సాక్షులు
గత ఏడాది అక్టోబరు 14 నుంచి హాజీపూర్ కేసుపై విచారణ కొనసాగింది. ఈ కేసులో మొత్తం 300 మంది సాక్షులుగా పేర్కొనగా, 101 మందిని ప్రశ్నించారు. విచారణ సమయంలో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని జడ్జి పలు ప్రశ్నలు వేయగా, తనకేమి తెలియదని తప్పించుకునే ప్రయత్నాలు చేశాడు. నిందితుడికి ఉరిశిక్ష వేయాలంటూ బాధితురాలు కుటుంబీకులు ఇటీవల గవర్నర్‌కు వినతి పత్రం కూడా సమర్పించారు.
సమత కేసు..
అలాగే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్‌లో గత ఏడాది నవంబర్ 24వ తేదీన ఓ వివాహిత సమతపై షేక్ మగ్దూం, షేక్ బాబు, షేక్ షాబూద్దీన్‌లు అత్యాచారం చేసి పాశవికంగా హత్య చేశారని ఆదిలాబాద్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ కేసులకు సంబంధించి తీర్పులను రెండు న్యాయస్థానాలు జనవరి 27కు వాయిదా వేయగా, ఈ రోజు విచారణ జరిపిన న్యాయస్థానం.. జనవరి 30కి వాయిదా వేసింది. నేడు ఈ రెండు కేసుల్లో తుది తీర్పు వస్తుందనుకున్న ప్రజలకు నిరాశ ఎదురైంది.