ఒక్క ప‌రుగు కోసం ప్రాణం మీద‌కు.. ఏం జ‌రిగిందంటే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Jan 2020 12:18 PM GMT
ఒక్క ప‌రుగు కోసం ప్రాణం మీద‌కు.. ఏం జ‌రిగిందంటే..!

క్రికెట్‌.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ ఆట‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అభిమానుల్లో ఆ క్రేజ్ దృష్ట్యా ఆ ఆట కూడా కొత్త‌పుంత‌లు తొక్కుతుంది. అయితే క్రికెట్ ఆట‌లో కాస్త రిస్క్‌ తక్కువని అంద‌రి అభిప్రాయం. అయితే ఏ మాత్రం ఏమ‌ర‌పాటు వ్య‌వ‌హ‌రించినా ఊహించ‌ని పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇందుకు గతంలో ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఫిలిప్‌ హ్యూస్ ఉదంతమే ఉదాహరణ. అటువంటి ఘ‌ట‌నే మ‌రోటి చోటుచేసుకుంది.

వివ‌రాళ్లోకెళితే.. ఆసీస్ దేశ‌వాళీ లీగ్ బీబీఎల్(బిగ్‌బాష్ లీగ్‌)లో భాగంగా మంగళవారం హోబ‌ర్ట్ హరికేన్స్‌, మెల్‌బోర్న్ రెనెగెడ్స్‌ జట్ల‌ మధ్య పోరు జరిగింది. మెల్‌బోర్న్ రెనెగ‌డ్స్ ఇన్నింగ్సు సందర్భంగా.. హరికేన్స్‌ బౌలర్‌ నాథన్‌ ఎల్లిస్‌ వేసిన బంతిని బ్యాట్స్‌మన్‌ సామ్‌ హార్పర్‌ మిడాఫ్‌ మీదుగా ఆడి సింగిల్‌ తీసే ప్రయత్నం చేశాడు.



అయితే.. మిడాఫ్‌లో ఉన్న ఫీల్డర్‌ బంతిని అందుకోవ‌డాన్ని చూసిన‌ హార్పర్‌.. ఎదురుగా ఉన్న బౌలర్ నాథన్‌ ఎల్లిస్ ను చూడ‌కుండా పరిగెత్తాడు. దీంతో వికెట్ల దగ్గరే ఉన్న ఎల్లిస్‌ను హార్పర్‌ బలంగా ఢీ కొట్టి గాల్లొకి ఎగిరాడు. గాల్లోనుండి కిందపడే సమయంలో హార్పర్‌ మెడ బలంగా మైదానాన్ని తాకింది. దీంతో హార్పర్‌ నొప్పితో విలవిల్లాడు.

వెంట‌నే డాక్టర్లు వచ్చి హార్పర్‌కు ప్రాథమిక చికిత్స అందించారు. అయితే.. అతడికి మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించాలని డాక్టర్లు సూచించారు. దీంతో హార్పర్‌ రిటైర్ట్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే ఈ ఘటన జరిగిన తీరు చూశాక.. సహచర ఆటగాళ్లతో పాటు మైదానంలోని ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

Next Story