సల్మాన్‌ఖాన్ హత్యకు కుట్ర.. షూటర్ అరెస్ట్
By సుభాష్ Published on 20 Aug 2020 3:16 AM GMTబాలీవుడ్ మరోసారి ఉలిక్కిపడింది. మరోస్టార్‌పై హత్యకు కుట్ర జరగడం సంచలన సృష్టించింది. బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ హత్యకు కుట్ర పన్నిన విషయాన్ని పోలీసులు ఛేదించారు. సల్మాన్‌ఖాన్‌ను హత్య చేసేందుకు ఓ రెక్కీ నిర్వహించాడని, రాజస్థాన్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాలోని పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. షూటర్ రాహుల్ ఆలియాస్ సంగాను ఉత్తరఖాండ్‌లోని ఫరీదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సల్మాన్‌ఖాన్‌ను హత్య చేసే బాధ్యత లారెన్స్ బిష్ణోయ్ రాహుల్‌కు అప్పగించాడని, రాహుల్ గత జనవరిలో ముంబై వచ్చి సల్మాన్‌ఖాన్ నివాసముండే బాంద్రాలో మూడు రోజుల పాటు రెక్కీ నిర్వహించాడు. అయితే ఫరీదాబాద్‌లో ప్రవీణ్ అనే వ్యక్తిని రాహుల్ హత్య చేయగా,ఈ కేసుకు సంబంధించి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులు భాగంగా రాహుల్‌ను విచారించిన పోలీసులకు సంచలన నిజాలు వెల్లడించాడు. స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌ను చంపేందుకు ప్లాన్ చేసినట్లు రాహుల్ పోలీసుల ముందు అంగీకరించాడు. కృష్ణ జింకలను వేటాడిన కేసులు సల్మాన్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే.
అయితే రాజస్థాన్‌లోని బిష్ణోయ్ సమాజం కృష్ణ జింకలను ఆరాధిస్తుంది. సల్మాన్‌ఖాన్ జింకలను వేటాడినప్పటి నుంచి ఆయనపై ఈ జాతికి చెందిన కొందరు శతృత్వం పెంచుకున్నట్లు పోలీసులు వివరించారు. ఈ నేపథ్యంలో లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్‌పై రెండు సార్లు హత్యకు ప్రయత్నించినట్లు పోలీసులు వివరించారు.
అయితే సల్మాన్‌పై హత్యాయత్నం జరగడం ఇదేం తొలిసారి కాదు. 2018లో కూడా ఇదే గ్యాంగ్‌కు చెందిన సంపత్ నెహ్రా అనే షూటర్ సల్మాన్‌ను చంపేందుకు కుట్రపన్నడమే కాకుండా రెక్కీ కూడా పూర్తి చేసినట్లు పోలీసులు వివరించారు. కానీ అనుకోకుండా సంపత్ నెహ్రా అరెస్ట్ కావడంతో అది విఫలమైంది.