సుక్కును నమ్మి ఇంకో యంగ్ హీరో..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Aug 2020 8:55 AM GMT
సుక్కును నమ్మి ఇంకో యంగ్ హీరో..

సుకుమార్.. టాలీవుడ్లో ఈ పేరొక బ్రాండ్ ఇప్పుడు. ఆయన పేరు చూసి వంద కోట్లు పెట్టడానికి రెడీగా ఉన్న నిర్మాతలు ఎంతోమంది. కథ కూడా వినకుండా సినిమాలు చేసే స్టార్లకూ కొదవ లేదు. ఐతే సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఇంత నమ్మకం పెట్టడం వేరు. కానీ సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో.. ఆయన శిష్యుల దర్శకత్వంలో నటించడానికి, సినిమాలు నిర్మించడానికి కూడా చాలామందే ముందుకొస్తున్నారు.

ఇప్పటికే వేమారెడ్డి, పల్నాటి సూర్య ప్రతాప్, హరిప్రసాద్ జక్కా, హుస్సేన్ షా కిరణ్ లాంటి వాళ్లు సుక్కు దగ్గర పని చేసిన అనుభవంతోనే దర్శకులుగా అవకాశం దక్కించుకున్నారు. వీళ్లలో ఎవరు ఏమేర సక్సెస్ అయ్యారన్నది పక్కన పెడితే.. సుక్కు ఆమోద ముద్ర వేసిన కథలపై నమ్మకంతో, ఆయన శిష్యులపై భరోసాతో సినిమాలు చేయడానికి మాత్రం హీరోలు, నిర్మాతలు ముందుకొస్తూనే ఉన్నారు.

‘ఉప్పెన’తో పరిచయం కానున్న బుచ్చిబాబు సానా కూడా సుక్కు శిష్యుడే. ‘కుమారి 21 ఎఫ్’ తర్వాత సుక్కు మరో శిష్యుడు సూర్య ప్రతాప్‌.. నిఖిల్‌తో’18 పేజెస్’ అనే సినిమా తీయబోతున్న సంగతీ తెలిసిందే. ఇప్పుడు కార్తీక్ దండు అనే మరో సుక్కు శిష్యుడికి సినిమా సెట్టయింది. ఆ సినిమా చేయబోయేది సాయిధరమ్ తేజ్ కావడం విశేషం. ఇదో హార్రర్ మూవీ కావడం గమనార్హం.

ఈ చిత్రాన్ని శుక్రవారం స్వయంగా సాయిధరమ్ తేజే అనౌన్స్ చేశాడు. దీని ప్రి లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశాడతను. అది చూస్తే హార్రర్ సినిమా ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తనకిది కొత్త జానర్ అని తేజు తెలిపాడు. తేజు కొత్త చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’ను నిర్మించిన సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాదే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయనున్నాడు. ఈ చిత్రంలో సుకుమార్ కూడా నిర్మాణ భాగస్వామే. మిగతా నటీనటులు, టెక్నీషియన్ల సంగతి ఇంకా ఖరారవ్వలేదు.

Next Story