సాధువుల హత్య కేసులో 110 మంది అరెస్ట్‌

By సుభాష్  Published on  21 April 2020 4:41 AM GMT
సాధువుల హత్య కేసులో 110 మంది అరెస్ట్‌

మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. పాలిఘర్‌లో ఈనెల 16న ఇద్దరు సాధువులు వారి గురువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వాహనంలో వెళ్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు కారును అడ్డగించి సాధువులతో పాటు కారు డ్రైవర్‌ను హత్య చేశారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకోలేకపోయారు. మత విద్వేషాలతోనే సాధువులను హత్య చేశారని సోషల్‌ మీడియాలో పుకార్లు షికార్లు కావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

Sadhus Murder Case

ఈ ఘటనకు సంబంధించిన 110 మందిని పాల్‌ఘర్‌ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో 9 మంది మైనర్లు ఉన్నట్లు సమాచారం. వారిని జువెనైల్‌ హోమ్‌కు తరలించారు. ఇక నిందితులను ఏప్రిల్‌ 30వ తేదీ వరకూ పోలీసు కష్టడిలో ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌లు నాకు ఫోన్‌ చేశారని ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే తెలిపారు. ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఈ ఘటనలో హిందు, ముస్లిం వివాదం లేదని స్పష్టం చేశారు. దొంగలంటూ పుకార్లు రావడంతోనే సాధువులపై దాడి జరిగిందని, ఈ ఘటనపై రాజకీయం చేయవద్దని అన్నారు. ఈ విషయంలో ఇద్దరు పోలీసులను సస్పెండ్‌ చేసినట్లు ఉద్దవ్‌ తెలిపారు.

Sadhus Murder Case

బీజేపీ నేతల ఆగ్రహం

మరో వైపు ఈ ఘటనపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దీనిపై ఉన్నత స్థాయిలో విచారణ చేపట్టి దోషులను కఠినగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. కాగా, ఈ కేసును మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

ఈ మూక దాడిలో మృతి చెందిన సాధువుల్లో ఒకరి వయసు 70 సంవత్సరాలు కాగా, మరో సాధువు వయసు 35 ఏళ్లు. కారు డ్రైవర్‌ వయసు 30 ఏళ్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.

Next Story
Share it