తెరుచుకున్న శబరిమల ఆలయం.. మార్గదర్శకాలు విడుదల చేసిన కేరళ ప్రభుత్వం
By సుభాష్ Published on 17 Oct 2020 6:32 AM GMTకేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది. నిన్నటి నుంచి తెరుచుకున్న ఆలయం.. ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు జరగనున్నాయి. కోవిడ్ జాగ్రత్తలతో కేవలం 250 మంది భక్తులకు మాత్రమే ప్రవేశానికి అనుమతి ఉందని ఆలయ అధికారులు తెలిపారు. వర్చ్యువల్ క్యూ పద్దతి ద్వారా 246 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అయితే కరోనా నెగిటివ్ రిపోర్టు ఉన్నవారికి మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. శబరిమల అయ్యప్ప దీక్షలు దగ్గర పడుతుండటంతో కేరళ సర్కార్ చర్యలు చేపట్టింది. ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు యాత్రకు రానున్న నేపథ్యంలో కరోనా పరిస్థితుల దృష్ట్యా పలు మార్గదర్శకాలను విడుదల చేశారు. ఆయా రాష్ట్రాల్లో స్థానిక భాషల్లో ప్రచురిస్తూ అందరికి తెలియజేయాలని కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విశ్వాస్ మెహతా అధికారులకు సూచించారు.
ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. శబరిమలకు వచ్చే భక్తులు ముందుగానే కేరళ పోలీసు శాఖ అభివృద్ధి చేసిన వర్చవల్ క్యూ పోర్టల్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలిన. దీని కోసం https://sabarimalaonline.org వెబ్‌సైట్‌ను సందర్శించాలి. వారం ప్రారంభంలోనే రోజుకు వెయ్యి మంది, వారాంతాల్లో రోజుకు రెండువేల మంది చొప్పున పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. పరిస్థితులను బట్టి మార్పులు చేర్పులు జరుగుతాయి. అలాగే దర్శనానికి 48 గంటల ముందు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. దీనిలో నెగిటివ్ వచ్చినవారికే అనుమతి ఇస్తారు.
ప్రవేశ మార్గంలో యాంటీజెన్ పరీక్షలు చేస్తారు. పది సంవత్సరాల లోపు వారికి, అలాగే 60 నుంచి 65 సంవత్సరాలు దాటిన వారికి దర్శనానికి అనుమతించరు. దీర్ఘకాలిక వ్యాధులున్నవారు శబరిమలకు రాకుండా ఉంటే మంచిదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు.
శబరిమల యాత్రకు వచ్చిన వాళ్లు తమతో ఆయుష్మాన్ భారత్, బీపీఎల్ తదితర ఆరోగ్యబీమా కార్డులను వెంట తెచ్చుకోవాలి.
స్వామివారికి నెయ్యాభిషేకాలు, పంపా నదిలో స్నానాలు, సన్నిధానంలో రాత్రి బస చేయడం వంటి వాటిని అనుమతి ఉండదు.
కేవలం ఎరుమేలి, వడసెర్రికర మార్గాల్లో మాత్రమే భక్తులకు అనుమతిస్తారు. మిగతా అన్ని రూట్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు వెల్లడించారు. పంపా, నీలక్కల్, సన్నిధానం వద్ద టాయిలెట్, బాత్రూమ్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
అలాగే దేవాలయానికి వెళ్లే మార్గంలో వివిధ చోట్ల శానిటైజర్లు, సబ్బు, నీటి వసతులు ఏర్పాట్లు చేసింది. భక్తులందరికీ స్వామి అయ్యప్పన్ రోడ్ గుండా ఎక్కి దిగుతారు. అయితే సన్నిధానం వద్ద దర్శనం కోసం మాస్క్‌లు, భౌతిక దూరం తప్పనిసరిగ్గా పాటించాలి.