రష్యా ప్రధాని రాజీనామా

By జ్యోత్స్న  Published on  16 Jan 2020 9:36 AM IST
రష్యా ప్రధాని రాజీనామా

రష్యా ప్రధాన మంత్రి దిమిత్రి మెద్వెదేవ్‌ తన పదవికి రాజీనామా చేసారు. దిమిత్రితో సహా రష్యా ప్రభుత్వ మంత్రిమండలి మొత్తం పదవుల నుంచి వైదొలగినట్లు నట్లు రష్యా లోని టాస్‌ న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ బుధవారం జాతిని ఉద్దేశించి మాట్లాడిన క్రమంలో దిమిత్రి రాజీనామా ప్రకటన చేయడం గమనార్హం. పుతిన్‌ మాట్లాడుతూ... రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఉందని.. ఈ మేరకు ప్రధాని, మంత్రుల అధికారాలను మరింత బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉందంటూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మెద్వదేవ్‌కు పుతిన్ ధన్యవాదాలు తెలిపారని, కానీ విధించిన లక్ష్యాలను చేరుకోవడంలో కేబినెట్ విఫలమైన విషయాన్ని ప్రస్తావించారని రష్యన్ న్యూస్ ఏజెన్సీలు తెలిపాయి. కొత్త కేబినెట్ ఏర్పాటు చేసే వరకు పని చేయాలని మెద్వదేవ్‌కు కేబినెట్‌కు పుతిన్ సూచించారు.

అయితే మెద్వదేవ్‌కు పుతిన్‌తో దీర్ఘకాల అనుబంధం ఉంది. దీంతో తన ఆధ్వర్యంలో పని చేసే ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీగా మెద్వదేవ్‌ను నియమించే యోచనలో పుతిన్ ఉన్నట్లుగా సమాచారం. 2012 నుంచి ఆయన రష్యా ప్రధాన మంత్రి పదవిలో ఉన్నారు. అంతకు ముందు నాలుగేళ్ల పాటు.. 2008-12 మధ్య ఆయన రష్యా అధ్యక్షుడిగా పని చేశారు. ఆ సమయంలో పుతిన్ రష్యా ప్రధానిగా ఉన్నారు.

ప్రధాన మంత్రి, కేబినెట్ మంత్రుల అధికారాలను పెంచడంతో.. పుతిన్ అనేక రాజ్యాంగ సవరణలను ప్రతిపాదించారు. ఈ సవరణల ప్రకారం భవిష్యత్తులో ఎవరైనా గరిష్టంగా రెండు పర్యాయాలు మాత్రమే రష్యా అధ్యక్షుడిగా పని చేయడం సాధ్యం అవుతుంది. అంతే కాకుండా ప్రధానిని, కేబినెట్ ఎంపిక చేసే అధికారాలను అధ్యక్షుడికి బదులుగా పార్లమెంట్‌కు కట్టబెడతారు. బుధవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన అధ్యక్షుడు ఈ అంశాలను ప్రస్తావించారు.

2024లో పుతిన్ అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతారు. ఆ తర్వాత తనకోసం ఓ పదవిని సృష్టించుకోవడం కోసం పుతిన్ ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నారు. 2000 సంవత్సరం నుంచి పుతిన్ రష్యా అధ్యక్షులుగా ఉన్నారు. స్టాలిన్ తర్వాత అత్యధిక కాలం రష్యాను పరిపాలించిన నేత పుతినే కావడం గమనార్హం.

Next Story