ఆది పినిశెట్టి ప్రేమలో పడ్డాడా?
By మధుసూదనరావు రామదుర్గం Published on 17 July 2020 12:36 PM ISTవర్ధమాన విలక్షణ నటుడు అదిపినిశెట్టి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. తెలుగు బ్లాక్ బస్టర్ రంగస్థలం, సరైనోడు, నిన్నుకోరి సినిమాల్లో నటించి తన సత్తా చాటిన ఆది పడ్డానండి ప్రేమలో మరి అని అంటున్నాడా? అసలు విషయం ఏంటో గానీ తాజాగా తను నిక్కి గల్ రానితో జట్టుగా తిరుగుతున్నట్లు వార్తలు సోషల్ మీడియా, ప్రధాన మీడియాల్లో హల్ చల్ చేస్తున్నాయి. ఆది, నిక్కి జంటగా 2017లో రిలీజైన మరకతమణిలో నటించారు. ఇంతకూ ఈ విషయం ఇంతగా వైరల్ కావడానికి ప్రధాన కారణం ఒకటుంది.
మరి నిప్పు లేనిదే పొగ రాదంటారుగా! ఇటీవల ఆది పినిశెట్టి తండ్రి రవిరాజా పినిశెట్టి పుట్టన రోజు వేడుకల్ని తాముంటున్న చెన్నైలో నిరాడంబరంగా నిర్వహించారు. తమిళనాడులో కరోనా విలయ తాండవం చేస్తున్న దరిమిలా ఈ వేడుకకు బంధువులు, స్నేహితులు ఎవరినీ ఆహ్వానించకుండా కేవలం కుటుంబ సభ్యులకే పరిమితం చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ వేడుకల్లో నిక్కి మెరుపు తీగలా మెరిసి కనిపించడంతో చాలామందిలో అనుమానం మొదలైంది. ఇంకేముంది మరి కాస్త లోతుగా తవ్వడం ప్రారంభించారు.
ఆది కుటుంబ సభ్యులు మాత్రమే చేసుకున్న ఆ పుట్టిన రోజు వేడుకల్లో నిక్కి కనిపించింది. ఆది ట్విటర్ లో వేడుక తాలూకు ఫొటోలు షేర్ చేసుకోవడంతో పొగ కాస్త గుప్పుమంది. కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా తీసుకున్న ఫ్యామిలీ ఫొటోలోనూ కనిపించడం చర్చనీయాంశమైంది. ఆదిపినిశెట్టి, నిక్కి ఇద్దరూ ప్రేమలో ఉన్నారని ఈ వ్యవహారాన్ని పెళ్లి దాకా తీసుకెళ్లే అవకాశం ఉందని కొందరు గుసగుసలాడుతున్నారు. అయితే ఈ జంట మాత్రం ఏ విషయం చెప్పక మౌనం పాటిస్తోంది. ఈ మౌనం మరిన్ని ఊహలకు దారి తీస్తోంది. తాజా సమాచారం మేరకు ఆది.. అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప' సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.