రగ్బీ కోచ్ కాస్తా.. చైనా స్నాచర్ గా మారిపోయాడే..!

By రాణి  Published on  20 Feb 2020 7:30 AM GMT
రగ్బీ కోచ్ కాస్తా.. చైనా స్నాచర్ గా మారిపోయాడే..!

మోహన్ దేవ్ రావ్ చవాన్ వాళ్ళ ఊర్లో బాగా ఫేమస్.. మహారాష్ట్ర పోలీసు విభాగంలో హోమ్ గార్డ్ గా కూడా పనిచేస్తూ ఉండేవాడు. తన సొంత డబ్బులతో రగ్బీ బంతులను కొని యువకులకు అందించేవాడు. అలాగే రగ్బీ మీద ప్రేమ ఉన్న వాళ్లకు తానే కోచింగ్ ఇచ్చేవాడు. బుధవారం నాడు అతన్ని హైదరాబాద్ పోలీసులు మీడియా ముందుకు తీసుకొని వచ్చారు..అతడు చేసిన మంచి పనులకు సన్మానం చేద్దామని కాదు.. అతడో 'చైన్ స్నాచర్' అని అందరికీ తెలియజేయాలని.

సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(రైల్వేస్) బి.అనురాధ మీడియాతో మాట్లాడుతూ 28 సంవత్సరాల మోహన్ దేవ్ రావ్ చవాన్ గురించి విస్తుపోయే నిజాలను బయటపెట్టారు. చవాన్ వ్యసనాలకు అలవాటు పడ్డాడని..శాలరీ అతడి ఖర్చులకు సరిపోకపోవడం..గర్భవతి అయిన భార్య మెడికల్ ఖర్చుల కోసం దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు..చివరికి హైదరాబాద్ లో దొరికిపోయాడు.

నాందేడ్ ఉమ్రి తాలూకులో ఉన్న కార్లా తాండా చవాన్ సొంత గ్రామం. తన సొంత డబ్బులతో రగ్బీ బంతులను కొని యువకులకు అందించేవాడు. రగ్బీ కోచింగ్ ఇచ్చేవాడు. తనకంటూ ఓ సొంత టీమ్ ను ఏర్పాటు చేసుకునే స్థాయికి ఎదిగాడు. ఇటువంటి సమయంలో ముదాఖేడ్ తాలూకాకు చెందిన ప్రదీప్ అనే స్నేహితుడితో చేతులు కలిపాడు. గత సంవత్సర కాలంగా వారిరువురు చైన్ స్నాచింగ్ నే వృత్తిగా ఎంచుకున్నారు. తన హోం గార్డు వృత్తిని కూడా వదిలేశాడు. తెలంగాణ ఆదిలాబాద్ జిల్లాలోని బాసర రైల్వే స్టేషన్ లో ఎనిమిది చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డాడు. ముందుగా స్టేషన్ లో రెక్కీ నిర్వహించేవారు..ఆ తర్వాత ప్లాట్ ఫామ్ నెంబర్-2 లో నుండి చిన్నగా స్టేషన్ బయటకు జారుకునేవారు. రాత్రి సమయాల్లో వీరు ఈ చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డారు. నరసాపూర్ ఎక్స్ ప్రెస్ వచ్చే సమయంలోనే ఈ ఎనిమిది చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డారు. చవాన్ దొంగిలించిన బంగారాన్ని అమ్మడానికి ముంబైకు కూడా వెళ్ళేవాడు. అక్కడ ఒకటిన్నర లక్ష రూపాయల బంగారాన్ని అమ్మేశాడు. మిగిలిన బంగారాన్ని నిజామాబాద్ లో అమ్మాలని ప్రయత్నించే సమయంలో పోలీసులు అతడిని పట్టుకున్నారు. 116 గ్రాముల బంగారం, 1.5 లక్షల డబ్బును పోలీసులు అతడి నుండి రికవరీ చేశారు. మహారాష్ట్ర లోని ధర్మాబాద్, నాందేడ్ లాంటి ప్రాంతాల్లోనూ తాము చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డామని చవాన్ ఒప్పేసుకున్నాడు.

Next Story
Share it