ఫామ్‌లో ఉండగానే పక్కన పెట్టేశారు : ఆర్పీసింగ్
By తోట వంశీ కుమార్ Published on 26 April 2020 6:27 PM ISTభారత క్రికెట్‌లో లెఫ్ట్ ఆర్మ్ పేసర్లు చాలా అరుదు. మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ కు ప్రత్యాయంగా కనిపించిన ఆటగాడు ఆర్పీసింగ్. తొలిసారి భారత్ టీ20 ప్రపంచకప్‌ను అందుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఈ ఆటగాడు ఆ తరువాత తెరమరుగయ్యాడు. ఫామ్‌లో ఉన్నప్పటికి జట్టులో తనకెందుకు చోటు లభించలేదో.. ఇప్పటికి కూడా సమాధానం తెలియదని అన్నాడు.
తాజాగా.. ఆర్పీసింగ్ మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రాతో కలిసి ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో పాల్గొన్నాడు. యూపీలో జన్మించిన ఆర్పీసింగ్ 2005లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరగ్రేటం చేశాడు. 2007లో జరిగిన టీ20 ప్రపంచకప్ భారత జట్టు గెలుపొందడంతో కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా ఉన్నాడు. 7 మ్యాచ్‌లు ఆడిన ఆర్పీ 12 వికెట్లు పడగొట్టి భారత జట్టు తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా గుర్తింపు పొందాడు. ఇంకేముంది.. బంతి రెండు వైపులా స్వింగ్ చేయగల బౌలర్ కావడంతో అతడి కెరీర్‌కు డోకా లేదని అందరూ బావించారు. అయితే.. అనూహ్యంగా అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ.. ప్రపంచకప్ అనంతరం కేవలం మూడు టీ20 లు మాత్రమే ఆడాడు.
టీమ్ఇండియాకు ఎంపిక కాకముందో మహేంద్ర సింగ్ ధోనితో మంచి స్నేహముందని చెప్పుకొచ్చాడు ఈ మాజీ పేసర్. మేమిద్దం కలిసి చాలా విషయాలు చర్చించుకునేవాళ్లమని.. అయితే.. కెప్టెన్ అయ్యాక ధోని కెరీర్ అమాంతంగా దూకుసుపోయిందని, తన కెరీర్ మాత్రం పాతాళానికి పడిపోయిందని చెప్పాడు. అయితే.. ఇప్పటికి కూడా ధోనితో తనకు ఉన్న స్నేహాం ఏ మాత్రం చెక్కు చెదరలేదన్నాడు.
కాగా.. ఓ సందర్భంలో టీమ్ఇండియా తరుపున మళ్లీ ఆడాలంటే ఏం చేయాలని ధోనిని అడిగానని.. కానీ ధోని ఇప్పటి వరకు కూడా తనకు సరైన సమాధానం చెప్పలేదన్నాడు. నువ్వు కష్టపడుతూ ఉండు.. ఆపై అదృష్టం ఉంటే..జట్టులో చోటు లభిస్తుందని ధోని చెప్పాడని తెలిపాడు. ఫామ్‌లో ఉన్న తనను ఎందుకు పక్కకు పెట్టారో కూడా సెలక్టర్లు చెప్పలేదన్నాడు.
భారత్ తరుపున 58 వన్డేల్లో, 14 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించిన ఈ ఆటగాడు.. టెస్టుల్లో 40 వికెట్లు, వన్డేల్లో 69 వికెట్లు ను పడగొట్టాడు. ఫామ్‌లో ఉన్నప్పుడే జట్టుకు దూరమయ్యా. ఆ తరువాత ఐపీఎల్ రెండు మూడు సీజన్లలో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచా.. అయినప్పటికి ఇప్పటికి జట్టులో ఎందుకు చోటు దక్కలేదో అర్థం కాలేదు. బహుశా అప్పటి కెప్టెన్ కు నాపై నమ్మకం లేకుండా అయినా ఉండాలి.. లేక నా ప్రదర్శన చెత్తగా అయినా ఉండి ఉండాలని ఆర్పీ అన్నాడు.మొత్తానికి ధోనీ తన స్నేహితుడే అంటూ అతని వల్లే తన కెరీర్ ముగిసిందని ఆర్పీ సింగ్ పరోక్ష వ్యాఖ్యలు చేశాడు.