పోలీసులు షాక్: రూ.3 కోట్ల మద్యం పట్టివేత..!
By సుభాష్ Published on 2 May 2020 8:38 PM ISTదేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కాలరాస్తుండటంతో లాక్‌డౌన్ కొనసాగుతోంది. దీంతో మద్యం షాపులు సైతం మూతపడ్డాయి. ఇదే అదనుగా భావించిన కొందరు అక్రమంగా మద్యం తరలింపు మార్గాన్ని ఎంచుకున్నారు. అధిక ధరలకు విక్రయిస్తూ భారీ మొత్తంలో సొమ్ము చేసుకునేందుకు బ్లాక్ దందాకు ఎగబడ్డారు. తాజాగా హర్యానాలోని ముర్తాల్ ప్రాంతంలో ఓ వాహనంలో తరలిస్తున్న అక్రమ మద్యాన్ని చూసి పోలీసులు షాకయ్యారు.
లాక్‌డౌన్ కారణంగా వెళ్తున్న వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తుండగా, అంతలోనే సుమారు ఐదారు వాహనాలు ఢిల్లీ వైపు వెళ్తున్నాయి. వాహనాలను ఆపి తనిఖీ చేస్తుండగా, భారీ మొత్తంలో విదేశీ మద్యం బాటిళ్లు కనిపించాయి. మద్యాన్ని చూసిన పోలీసులే ఆశ్చర్యానికి గురయ్యారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 62,400 మద్యం బాటిళ్లు కనిపించాయి. వాటి విలువ సుమారు రూ.3 కోట్లపైమాటే ఉంటుందని పోలీసులు ప్రకటించారు.
కాగా, విదేశీ మద్యం పెద్ద ఎత్తున రవాణా చేస్తున్నారని ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. ముర్తాల్ సమీపంలో ఉన్న ఓ దాబా వద్ద వాహనాలను తనిఖీ చేయగా, ఈ మద్యం బయట పడింది.
ఆ వాహనాల్లో 5200 బాక్సుల్లో 62,400 మద్యం బాటిళ్లను పంజాబ్‌లోని డేరాబాసి ప్రాంతం నుంచి ఢిల్లీలోని పలు ప్రాంతాలకు తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.