'RRR' టైటిల్ లోగో వచ్చేసింది
By తోట వంశీ కుమార్ Published on 25 March 2020 12:40 PM ISTదర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం అప్‌డేట్స్ కోసం ఇటు నందమూరి అభిమానులతో పాటు, అటు మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా.. ఈ సినిమా టైటిల్ లోగో వచ్చేసింది. ఈ చిత్రానికి RRR( రౌద్రం రణం రుధిరం) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ మేరకు శార్వరి నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం టైటిల్ లోగోతొ పాటు మోషన్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురం భీంగా ఎన్టీఆర్ కనిపించనున్నారు. రామ్‌చరణ్‌కు జోడిగా బాలీవుడ్ నటి ఆలియాభట్, ఎన్టీఆర్‌కు జోడిగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ నటిస్తున్నారు. దాదాపు రూ.300కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది