ఆర్‌ఆర్‌బీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌

By సుభాష్  Published on  24 Sep 2020 8:44 AM GMT
ఆర్‌ఆర్‌బీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌

ఆర్‌ఆర్‌బీ అభ్యర్థులకు రైల్వే మంత్రి గుడ్‌న్యూస్‌ వినిపించారు. ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్ష కోసం కోటి మందికిపైగా అభ్యర్థులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని 2020 డిసెంబర్‌ 15 నుంచి కంప్యూటర్‌ బేస్ట్‌ టెస్ట్‌ నిర్వహిస్తామని మంత్రి పీయూష్‌ గోయల్‌ వివరించారు. డిసెంబర్‌లో కరోనా వైరస్‌ పరిస్థితులను అంచనా వేసి రిక్రూట్‌మెంట్‌ పరీక్ష పూర్తి చేస్తామని తెలిపారు. 2020 డిసెంబర్‌ 15 నుంచి ఆర్‌ఆర్‌బీ పరీక్షలు ఉంటాయని ఇప్పటికే రైల్వేశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే ఈ పరీక్ష నిర్వహణపై అనేక సందేహాలు, అనుమానాలుండగా, వీటిపై రైల్వే మంత్రి లోక్‌సభకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఇప్పటికే గ్రూప్‌-డీ, అసిస్టెంట్ లోకో పైలట్స్‌ ఏఎల్‌పీ, టెక్నీషియన్‌ ఖాళీల భర్తీ ప్రక్రియ పూర్తయిందని, కొందరు ఏఎల్‌పీ అభ్యర్థులకు అపాయింట్‌మెంట్‌ లేటర్‌ రాలేదని అన్నారు. వీటిపై కరోనా తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు. అన్‌లాక్‌ ప్రక్రియ కొనసాగుతుండటంతో నియామక ప్రక్రియ దశల వారీగా ప్రారంభిస్తామని అన్నారు. అభ్యర్థులకు అపాయింట్‌మెంట్‌ లేటర్లు త్వరలోనే వస్తాయని మంత్రి స్పష్టం చేశారు.

అయితే ఆర్‌ఆర్‌బీ ఏఎల్‌పీ పోస్టులకు 47.45 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 56,378 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. 40,420 మంది అభ్యర్థులకు అపాయింట్‌మెంట్‌ లేటర్‌ వచ్చాయి. వాటిలో 22,223 మంది ఏఎల్‌పీలు కాగా, 18,197 మంది టెక్నీషియన్లు. మిగతా వారికి కూడా అపాయింట్‌మెంట్‌ లేటర్లు రానున్నాయి.

Next Story
Share it