మాస్క్ మీ ముఖానికి.. నెంబర్ ప్లేటుకు కాదు
By సుభాష్ Published on 24 Sep 2020 7:04 AM GMTప్రస్తుతం కరోనా ప్రపంచ దేశాలను సైతం అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకు విజృంభిస్తోంది. అయితే కరోనాకు ఎలాంటి వ్యాక్సిన్ లేని కారణంగా ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకోవడం తప్ప ఎలాంటి మార్గం లేదు. బయటకు వెళ్లాల్సిన సమయంలో ముఖానికి తప్పనిసరిగ్గా మాస్క్ ధరించడం. అలాగే సోషల్ డిస్టెన్స్ పాటించడం. ఇలా జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నుంచి తప్పించుకోవచ్చు. అయితే కొందరు అతితెలివి ఉపయోగించి రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారిపై పోలీసులు ఇప్పటికే ఓ నిఘా పెట్టారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ఓ వ్యక్తి బైక్ నెంబర్ ప్లేటుకు మాస్క్ అడ్డంగా కట్టాడు. మరి అతను మాస్క్ ధరించాడో లేదో తెలియదు కానీ.. బైక్ నెంబర్ ప్లేటుకు మాత్రం మాస్క్ పెట్టడం హైదరాబాద్ పోలీసుల కంట పడింది. దీంతో పోలీసులు సోషల్ మీడియా వేదికగా పలు సూచనలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీసు శాఖ బైక్‌కు మాస్క్ కట్టిన వ్యక్తిని పట్టుకునే పనిలో పడ్డారు. ' మాస్క్ ఉండాల్సింది మీ ముఖానికి మీ బైక్‌కు కాదు అంటూ సెటైర్ వేస్తూ సదరు మాస్క్ కట్టిన బైక్ ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు. హైదరాబాద్ పోలీసు శాఖ వాహనదారులకు అవగాహన కలిగించేందుకు సోషల్ మీడియా ద్వారా ట్వీట్లు చేస్తున్నారు. సదరు వాహనదారుడు నెంబర్ ప్లేట్ కనిపించకుండా మాస్క్ కట్టడంపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేస్తూ, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ రీ ట్వీట్ చేసిన రాష్ట్ర పోలీసు విభాగం.. మాస్క్ ముఖానికి.. బండికి కాదు అని సెటైర్ వేసింది. చలానా తప్పించుకోవడానికి మరో మార్గం కూడా ఉన్నది అదే 'ట్రాఫిక్ రూల్స్ పాటించడం.' ట్రాఫిక్ రూల్స్ అనేవి మీకు, మీ తోటి వాహనదారుల సౌకర్యార్థం, క్షేమం కోసమే అని గుర్తించండి అంటూ పోలీసులు బైక్‌కు కట్టిన మాస్క్ ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ పోలీసు శాఖ అధికారులు వాహనదారులకు సోషల్ మీడియా ద్వారా కూడా అవగాహన కల్పించే ట్వీట్లు చేస్తున్నారు.