రోషిణి.. విజయ రూపిణి..!
By మధుసూదనరావు రామదుర్గం Published on 18 July 2020 11:54 AM ISTదేశ ఐటీ రంగంలో మరో వెలుగు కెరటం ఎగసింది. ఆ కెరటం పేరు రోషిణి. వారసత్వం అంటే ఆస్తులు పంచుకోవడం కాదు, బాధ్యతలు కూడా అని అక్షరాల నిరూపిస్తోంది ఈ యువతి. ఐటీ దిగ్గజం హెచ్ సీఎల్ టెక్నాలజీస్ కు కొత్త ఛైర్ పర్సన్ గా రోషిణి నాడార్ మల్హోత్ర బాధ్యతలు స్వీకరించింది. ఆడదంటే అబల కాదు సబల అని నిరూపించిన మహిళల జాబితాలో మరో యువతేజం తన స్థానాన్ని పదిల పరచుకుంది. సంస్థ వ్యవస్థాపకులు, తన తండ్రి శివ నాడార్ స్థానంలో ఆయన ఏకైక కూతురు గారాల పట్టి రోషిణి పగ్గాలు పుచ్చుకుని తండ్రికి, సంస్థకు వెన్నెముకలా మారేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. లక్ష్మి ఉంటే సరస్వతి ఉండదు.. సరస్వతి ఉంటే లక్ష్మి ఉండదు అని అంటుంటారు. కానీ రోషిణి విషయంలో అలా కాదు ఇద్దరు దేవతలు మాట్లాడుకుని మరీ ఆమె వెన్నంటి నిలిచారా అనుకోక తప్పదు. కాకపోతే కంపెనీ స్ట్రాటజీ ఆఫీసర్ గా శివ నాడర్ కొనసాగుతారు. మూడుపదుల వయసులో ఉన్న రోషిణి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ఐటీ కంపెనీ బాధ్యతలు చేపట్టిని తొలి మహిళా సర్వాధికారిణిగా గుర్తింపును దక్కించుకుంది.
ఎకనామిస్ట్ కావాలనుకుని
శివనాడార్, కిరణ్ ల కలల పంట రోషిణిది చిన్నప్పటి నుంచి చురుకైన శైలి. గలగల గోదారిలా నిత్య చైతన్య స్రవంతిలా ప్రవహించే ఆమె జీవన విధానం పలువురిని ఆకట్టుకునేది. రోషిణి స్వేచ్ఛగా ఎదగడానికి స్వతంత్ర భావాలను అలవరచుకోడానికి చిన్ననాటి నుంచే అలవాటు పడింది. తండ్రిని తన మెంటర్ గా ఊహించుకున్న ఆమె ఏనాడు అతని మాటలకు ఎదురు చెప్పలేదు. అలాగని శివనాడర్ ఆమె వ్యక్తిగత అంశాల్లో జోక్యం చేసుకోలేదు. స్వయం నిర్ణయాలు తీసుకునే దిశగా ఆమెను ఎప్పటికప్పుడు ప్రోత్సహించేవారు. రోషిణి మొదట ఎకనామిక్స్ లో డిగ్రీ చేయాలని అనుకుంది. ఇదే విషయాన్ని తండ్రితో చెప్పింది. అప్పుడు శివనాడర్.. బేటీ నీకు ఏది ఇష్టమో ఆ పనే చేయి. ఒకరి కోసం చేయాలని అనే భావన నీ జీవితంలో ఎప్పటికీ రానీకు. ఇప్పుడు ఎకనామిక్స్‌లో డిగ్రీ చేయాలనుకుంటున్నావు, భేష్ కానీ ఈ నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకో. ఈ అడుగు వేస్తే మున్ముందు ఎలాంటి పరిణామాలు రాగలవో అంచనా వేయి. ఇదే ప్రతి ఒక్కరి విజయ రహస్యం. తమకు ఏది కావాలి అన్న విషయంగా స్పష్టత ఉండాలి. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక నూరు ఆరైనా అందుకు కట్టుబడి ఉండాలి.. అంటూ రోషిణికి తారకమంత్రం ఉపదేశించారు. తండ్రి మాటలు ఆమెకు బాగా నచ్చాయి. వాస్తవానికి దగ్గరగా మన ఆలోచనలుండాలన్న మాట మాత్రం తన జీవితంలో ప్రతి దశలోనూ వినిపిస్తుంటుందని రోష్నీ అంటుంది. అందుకే మళ్లీ ఆలోచించి మనసు మార్చుకుంది. రేడియో, టీవీ ఫిల్మ్ తదితర అంశాలున్న కమ్యూనికేషన్ లో డిగ్రీ చేయాలని అనుకుంది.
మీడియాలో మెరిసిందిలా
ఢిల్లీలో ప్రాథమిక విద్యానంతరం రోషిణి గ్రాడ్యుయేషన్ ను చికాగోలోని నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయంలో పూర్తి చేసింది. అనంతరం లండన్ లోని స్కైన్యూస్ లో న్యూస్ ప్రొడ్యూసర్ గా అనుభవం గడించింది. సీఎన్ఎన్ లోనూ పనిచేసింది. ఆ తర్వాత కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో సోషల్ ఎంటర్ ప్రైజస్ అండ్ మేనేజ్ మెంట్ స్ట్రాటజీలో పట్టా అందుకుంది.
సొంత కంపెనీలో సాధారణ ఉద్యోగిగా
చెట్టు పాటవం తెలుసుకోవాలంటే వేళ్ల గట్టిదనం ఎంతో అర్థం చేసుకోవాలి. లేదంటే అంత పెద్ద చెట్టు ఎదుగుదల అర్థం కాని మిస్టరీగా మిగిలిపోతుంది. ఏదైనా కింద నుంచి పైకి వెళితేనే ఆ ప్రస్థానం అర్థవంతంగా ఉంటుంది. అందుకే తండ్రి వారసత్వం వచ్చింది కదా అని రోష్నీ రాత్రికి రాత్రే ఛైర పర్సన్ కుర్చీలో కూర్చోలేదు. దాని వెనక ఎంతో పరిశ్రమ ఉంది. హెచ్‌సీఎల్ లో రోషిణి తొలుత ఓ సాధారణ ఉ ద్యోగిగా చేరింది. 2009లో దాని అనుబంధ సంస్థ హెచ్ సీ ఎల్ కార్పొరేషన్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టింది. ఆ తర్వాత నాలుగేళ్లకు సంస్థ అడిషనల్ డైరెక్టర్ గా పదోన్నతి పొందింది. దీంతో పాటు శివనాడార్ ట్రస్ట్ , కిరణ్ నాడార్ ఆర్ట్ మ్యూజియమ్ కు ట్రస్టీ గా వ్యవహరిస్తోంది. శివనాడార్ ట్రస్ట్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు నాణ్యమైన విద్య అందించేలా విద్యాజ్ఞాన్ వంటి సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అంతే కాదు ...ది హాబిటేట్స్ సంస్థను స్థాపించి వన్య ప్రాణుల పరిరక్షణకు నడుం బిగించింది. పర్యావరణ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తోంది.
యువతరానికి సారథిగా
హెచ్. సి. ఎల్. సంస్థలో చేరినప్పటి నుంచి కొత్త రక్తాన్ని ఎక్కించేందుకు శ్రమిస్తోంది రోష్నీ. ప్రతిభ ఉన్న యువత కంటపడితే చాలు వారిని నాయకులుగా ప్రతినిధులుగా మలచడానికి ఓ అనుభవం ఉన్న శిల్పిలా మారింది. కేవలం ఈ కార్యక్రమం కోసమే యంగ్ గ్లోబల్ లీడర్స్ అనే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది. అంతటితో రోష్నీ తపన ఆగిపోలేదు. ఐడియా ప్రెన్యూర్ పేరిట ఉద్యోగుల్లో కొత్త ఆలోచనలను శోధించి సంస్థ బలోపేతానికి అమలు చేసే దిశగా వినూత్న కార్యక్రమాలు చేపట్టింది.
సంగీత సాధకురాలు
ఒకవైపు తండ్రి ప్రారంభించిన సంస్థ లో పరిశ్రమిస్తునే మనసుకు నచ్చిన శాస్త్రీయ సంగీత సాధనకు శ్రీకారం చుట్టింది. ఎన్నో కచేరీలు చేసి తన స్వరసంపదను ప్రకటించుకుంది. తన జీవితం కూడా సప్తస్వరాల్లా సుగమ సంగీతంలా సాగిపోవాలని కలలు కనే సగటు యువతిలా 2010లో శిఖర్ మల్హోత్రా తో పెళ్లిపుస్తకం ప్రారంభించింది. తమ అనుబంధ పంటగా ఇద్దరు అబ్బాయిలు ఆర్మాన్ (2013), జహాన్ (2017)లకు జన్మనిచ్చింది.
అవార్డులు.. రివార్డులు
2014లో యంగ్ ఫిలాంత్రఫిస్ట్ అవార్డు ఎన్.డి.టీ.వీ ద్వారా అందుకుంది. 2017లో వోగ్ ఇండియా రోషిణిని ఆ సంవత్సరం యంగ్ ఫిలాంత్రఫిస్ట్ గా ప్రకటించింది. 2015లో వరల్డ్ సమ్మిట్ ఆన్ ఇన్నోవేషన్ అండ్ ఆంట్రప్రెన్యూర్ షిప్ నుంచి ది వరల్డ్ మోస్ట్ ఇన్నోవేటివ్ పీపుల్ అవార్డు సాధించింది.
రోషిణి పరిపూర్ణ జీవితాన్ని ఆశగా ఆసక్తిగా మలచుకుంటోంద. ఏ చిన్న సంబరాన్ని వదులుకోకుండా అన్ని దశల్లోనూ జీవితం ఓ హరివిల్లులా ఉండాలని కలలు కంటూ..ఆ కలలను నిజం చేసుకుంటున్న రోషిణి నిజంగా విజయ రూపిణి. ఇలాంటి యువతులను చూసినపుడల్లా అపుత్రస్య గతం నాస్తి అనే మాటకు కాలం చెల్లిందనిపిస్తుంది. అంతే కాదు కంటే కూతుర్నే కనాలి అనిపిస్తుంది కూడా! కాదంటారా!!