మరోమారు కోహ్లి రికార్డును బ్రేక్‌ చేసిన హిట్‌మ్యాన్‌

By Newsmeter.Network  Published on  2 Feb 2020 1:27 PM GMT
మరోమారు కోహ్లి రికార్డును బ్రేక్‌ చేసిన హిట్‌మ్యాన్‌

కివీస్‌తో జరిగిన ఐదో టీ20లో హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. భారత కెప్టెన్‌, పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును హిట్‌మ్యాన్‌ బద్దలు కొట్టాడు.

ఐదవ టీ20లో టాస్‌ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో తాత్కాలిక కెప్టెన్‌ గా వ్యవహరించిన రోహిత్ శర్మ తనదైన శైలిలో అభిమానులను అలరించాడు. 41 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు సాయంతో 60 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో పరుగుల యంత్రం పేరిట ఉన్న రికార్డును బ్రేక్‌ చేశాడు. టీ20ల్లో అత్యధిక అర్థశతకాలు చేసిన క్రికెటర్‌గా తన పేరును లిఖించుకున్నాడు. ఇప్పటివరకు 108 టీ20 మ్యాచ్‌ లు ఆడిన రోహిత్ 25 సార్లు 50 లేదా అంతకంటే ఎక్కువ సార్లు స్కోర్లను సాధించాడు. అంతే కాదు పొట్టి ఫార్మాట్‌ లో నాలుగు సెంచరీలను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో అత్యధిక అర్థశకాలు సాధించిన జాబితాలో 24 అర్థశతకాలతో కోహ్లీ రెండవ స్థానంలో ఉండగా.. మార్టిన్ గప్తిల్ (న్యూజిలాండ్), పాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్) లు 17 అర్థశతకాలతో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు.

అంతర్జాతీయ క్రికెట్‌ లో 14,000 వేల పరుగుల క్లబ్‌ లో..

హిట్ మ్యాన్‌ రోహిత్ శర్మ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటి వరకు అంత‌ర్జాతీయ క్రికెట్‌ లో అన్ని ఫార్మాట్లలో కలిసి 14వేల ప‌రుగుల‌ను పూర్తి చేసుకున్నాడు. మౌంట్ మాంగ‌నీలో న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న ఐదో టీ20లో 31 ప‌రుగుల మార్కును చేరుకోగానే రోహిత్ ఈ ఘనతను అందుకున్నాడు. 14వేల ప‌రుగుల్ని పూర్తి చేసిన ఎనిమిదో భార‌త ప్లేయ‌ర్‌గా రోహిత్ అరుదైన జాబితాలో చోటు ద‌క్కించుకున్నాడు. గ‌తంలో భార‌త్ త‌ర‌పున ఈ మైలురాయిని మ‌హ్మ‌ద్ అజారుద్దీన్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, ఎంఎస్ ధోనీ, సౌర‌వ్ గంగూలీ, రాహుల్ ద్ర‌విడ్‌, విరాట్ కోహ్లీ, స‌చిన్ టెండూల్క‌ర్ సాధించారు.

రోహిత్ పాటు కేఎల్‌ రాహుల్‌(45; 33 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స్‌లు), శ్రేయస్‌ అయ్యర్‌(33 నాటౌట్‌; 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) మరోసారి బాధ్యతాయుతంగా ఆడటంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో కివీస్‌ బ్యాట్స్ మెన్లు సీఫెర్ట్‌(50; 30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), రాస్‌ టేలర్‌(53; 47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించినా.. మిగతా బ్యాట్స్ మెన్లు విఫలం కావడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి.. 7 పరుగుల తేడాతో ఓడింది.

Next Story
Share it