వారిద్దరి తర్వాత రోహితే..! ఓ రేంజ్‌లో ఇరగదీస్తున్నాడు.!
By Medi Samrat Published on 28 Nov 2019 4:35 PM ISTటీమిండియా క్రికెటర్ రోహిత్‌శర్మ గత కొంత కాలంలో భీకర ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. వన్డేలు, టీ20 లే కాదు.. టెస్టుల్లో కూడా ఇరగదీస్తున్నాడు. మూడు ఫార్మట్లలో ఓపెనర్ గా సెటిల్డ్ పెర్మామెన్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇక్కడి వరకూ ఓకే... మైదానంలో ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడే.. 'హిట్‌మ్యాన్' ప్రచారకర్తగా కూడా ఓ ఊపు ఊపుతున్నాడు.
ప్రపంచకప్‌లో ఐదు శతకాలు బాదిన తర్వాత రోహిత్ బ్రాండ్ విలువ మరింత పెరిగింది. ప్రస్తుతం 22 బ్రాండ్‌లకు ప్రచారకర్తగా ఉన్న రోహిత్ రూ.73-75 కోట్ల వరకు సంపాదిస్తున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో కూడా ఓపెనర్‌గా చెలరేగడంతో మార్కెట్‌లో ప్రచారకర్తగా తన జోరును పెంచాడు. ఒక్క ఈ ఆర్థిక సంవత్సరంలోనే 10 కొత్త బ్రాండ్‌లతో ఒప్పందం చేసుకున్నాడు. బ్రాండ్ అంబాసిడర్‌గా ఎక్కువ సంపాదిస్తున్న వాళ్లలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ తర్వాతి స్థానంలో రోహిత్ కొనసాగుతున్నాడు.
రోహిత్ సంవత్సరంలో కనీసం రెండు రోజుల ఒప్పందానికి రోజుకు రూ.1 కోటి వసూలు చేస్తున్నట్లు మార్కెట్ నిపుణుల అంచనా. రోహిత్ కంటే కోహ్లీ దాదాపు 3-4 రెట్లు అధికంగా తీసుకుంటున్నాడు. ఐఎమ్‌జీ రిలయన్స్ స్పాన్సర్‌షిప్ అధిపతి నిఖిల్ బార్దియా మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా రోహిత్ తన బ్రాండ్ విలువను పెంచుకుంటున్నాడు. మార్కెట్‌లో మంచి గుర్తింపు సంపాదించాడని అన్నారు. కేవలం 2019 ఆర్థిక సంవత్సరంలోనే రోహిత్.. దాదాపు 55శాతం తన ఆదాయాన్ని పెంచుకున్నాడంటే రోహిత్ ఏరేంజ్‌లో సంపాదిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.