ఆధార్ వెనక్కు ఇచ్చేస్తామంటున్న హైదరాబాద్ లోని రోహింగ్యాలు.!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 Feb 2020 3:55 PM GMTమన దేశంలో తప్పు ధృవ పత్రాలు ఇచ్చి ఆధార్ కార్డు సంపాదించడం పెద్ద విషయమేమీ కాదు..! ఎక్కడ నుండో రావడం.. ఏదో ఒక చోటా-మోటా లీడర్ ను పట్టుకోవడం.. అతడు డబ్బులు తీసుకుని ఆధార్ లాంటివి సృష్టించడం. ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. దేశ భవిష్యత్తు గురించి కూడా పట్టించుకోకుండా విదేశీ వ్యక్తులకు కూడా చాలా ఈజీగా ఆధార్ లు సృష్టిస్తూ ఉంటారు మనోళ్లు. అలా రోహింగ్యాలు భారత్ లోకి చొరబడ్డారు. దేశంలోని పలు నగరాల్లో తాపీగా పనులు చేసుకుంటూ ఉన్నారు . హైదరాబాద్ లో కూడా బాలాపూర్ పరిధిలో రోహింగ్యాల శరణార్థుల శిబిరం ఉంది. అక్కడి రోహింగ్యాలకు ఆధార్ కార్డులు ఇప్పించిన ఘటన ఇప్పుడు సంచలనమైంది. రోహింగ్యా ముస్లింలకు నకిలీ పత్రాలు సృష్టించి.. వారికి ఆధార్‌కార్డులు ఇప్పించడం వెలుగులోకి రావడంతో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యు.ఐ.డి.ఏ.ఐ.) అధికారులు దీన్ని సీరియస్ గా పరిగణిస్తున్నారు. ఆధార్ కార్డులు ఎవరైతే పొందారో వారికి యు.ఐ.డి.ఏ.ఐ. నుండి నోటీసులు అందాయి. ఎన్ఆర్సి-సిఏఏ గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న తరుణంలో తమను ఎక్కడ దేశం నుండి బహిష్కరిస్తారోనని వాళ్ళు భయపడిపోతున్నారు. తాము తీసుకున్న ఆధార్ కార్డులు ఇచ్చేయడానికి తయారుగా ఉన్నామని మీడియాతో వాళ్ళు చెప్పారు.
సత్తార్ అనే ఆటో డ్రైవర్ 2018లో రోహింగ్యా ముస్లింలకు నకిలీ పత్రాలు సృష్టించి.. వారికి ఆధార్‌కార్డులు ఇప్పించినట్లు తేలింది. పాతబస్తీలో పలువురు బ్రోకర్లు నకిలీ పాత్రలు సృష్టించి 127 మంది రోహింగ్యా లకు ఆధార్ నమోదు చేయిస్తున్న విషయం బయటకు వచ్చింది. దీంతో తెలంగాణ పోలీసులు యు.ఐ.డి.ఏ.ఐ. కు లేఖ రాశారు. ఇందుకు స్పందించిన ఆధార్ యాజమాన్యం 127 మంది రోహింగ్యా ముస్లింలకు నోటీసులు జారీచేసింది. సరైన పత్రాలతో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే కొందరు జైలు జీవితాన్ని కూడా గడిపినట్లు తెలుస్తోంది. ఆధార్ అక్రమంగా పొందిన వాళ్ళు బెయిల్ పై బయటకు వచ్చారు.. ఇప్పుడు అందులో కొందరు కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. రోహింగ్యాలకు భారత ప్రభుత్వం శరణార్థి గుర్తింపు కార్డులు ఇచ్చి వారిని ఏదో ఒక పని చేసుకోమని చెబుతోంది.. కానీ కొందరు మాత్రం ఏకంగా భారత పౌరులుగా గుర్తింపు పొందాలనే తలంపుతో ఆధార్ ను సొంతం చేసుకున్నారు.. అలాగే ప్రభుత్వ పథకాలను కూడా పొందాలని ప్రయత్నిస్తున్నారు.
29 సంవత్సరాల పర్వీన్ అఖ్తర్ మాట్లాడుతూ.. 'తాను ఓరల్ కాన్సర్ తో బాధపడుతున్నానని.. తనకు ట్రీట్మెంట్ చేయాలంటే 2 లక్షల రూపాయల పైనే ఖర్చు అవుతుందని.. ఆధార్ ఉంటేనే ఆసుపత్రిలో ఆరోగ్య శ్రీ కింద ఆపరేషన్ చేస్తారని.. అందుకే నేను ఆధార్ కార్డు సంపాదించాను' అని చెప్పుకున్నాడు. మరో రెఫ్యూజీ మొహమ్మద్ జువైల్ మాట్లాడుతూ.. తాము మొదటిసారి భారత్ లోకి వచ్చినప్పుడు తమ యజమాని ఆధార్ కార్డు ఇప్పించాడనీ.. మూడేళ్ళ క్రితమే ఆధార్ విషయంలో నేను జైలు పాలయ్యానని.. నా దగ్గర ఆధార్ కార్డు లేదని.. ఇప్పుడు మరోసారి నాకు నోటీసులు పంపడంతో ఏమి చేయాలో కూడా పాలుపోవట్లేదని అన్నాడు.
నోటీసులు పంపిన రోహింగ్యాలను బాలాపూర్ లోని ఫంక్షన్ హాల్ కు రమ్మని పిలిపించారు అధికారులు. కానీ విచారణను రద్దు చేసిన అధికారులు మే నెలకు వాయిదా వేశారు. అప్పటిదాకా తమ పరిస్థితి ఏంటో అని కొందరు రోహింగ్యాలు టెన్షన్ పడుతుంటే మరికొందరు ఇక్కడి నుండి ఎక్కడికో వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.