భార‌త్‌కు మంచి ఫినిష‌ర్ అవ‌స‌రం.. అందుకు నేనున్నా..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 April 2020 3:43 PM GMT
భార‌త్‌కు మంచి ఫినిష‌ర్ అవ‌స‌రం.. అందుకు నేనున్నా..

టీమ్ఇండియాకు మంచి ఫినిష‌ర్ అవ‌స‌ర‌మ‌ని, ఆ స్థానాన్ని భ‌ర్తీ చేసేందుకు తాను సిద్దంగా ఉన్నాన‌ని సీనియ‌ర్ ఆట‌గాడు రాబిన్ ఉత‌ప్ప తెలిపాడు. భార‌త జ‌ట్టు త‌రుపున 2015లో త‌న చివ‌రి మ్యాచ్ ఆడిన 34ఏళ్ల ఉత‌ప్ప తాను మ‌ళ్లీ జ‌ట్టులోకి వ‌స్తాన‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశాడు.

2007 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌తో పాటు అదే ఏడాది జ‌రిగిన టీ20 ప్ర‌పంచ క‌ప్ జ‌ట్టులో ఉన్నాడు. టీమ్ఇండియా తొలిసారి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ను గెల‌వ‌డంలో త‌న వంతు పాత్ర‌ను పోషించాడు ఈ రైట్‌హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌.

త‌న‌లో ఇంకా క‌సి అలాగే ఉంద‌ని, త‌ప్ప‌కుండా స‌త్తా చాటీ.. పొట్టి ఫార్మాట్‌లో మ‌రోసారి టీమ్ఇండియా త‌రుపున టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆడతాన‌నే న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నాడు. అందుకు దేవుడి ఆశీర్వాదంతో పాటు అదృష్టం కూడా ఉండాల‌న్నాడు. భార‌త్‌లో ఇది ఎంతో ముఖ్య‌మని, ఇత‌ర దేశాల్లో పెద్ద‌గా అవ‌స‌రం లేద‌న్నాడు. ఇక మ‌న‌పై మ‌న‌కు విశ్వాసం ఉంచుకోవాల‌న్నాడు. 2011 నుంచి కేవ‌లం 8 వ‌న్డేలు, నాలుగు టీ20 మాత్ర‌మే ఆడాన‌ని తెలిపాడు. టీమ్ఇండియా త‌రుపున చివ‌రి సారి 2015లో జింబాజ్వేతో టీ20 మ్యాచ్‌లో ఆడాన‌ని పేర్కొన్నాడు.

'భార‌త్ త‌రుపున ప్రాతినిధ్యం వ‌హిస్తాన‌ని విశ్వ‌సిస్తున్నా. విశ్వ‌విజేత‌గా నిలిచే జ‌ట్టులో నేను మ‌రోసారి భాగం కావాల‌నుకుంటున్నా. నా క‌ల‌లు ఇంకా స‌జీవంగానే ఉన్నాయి. క‌ప్ గెల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తా. రోజు రోజుకి నా ఆట మెరుగుప‌రుచుకోవ‌డానికి తీవ్రంగా శ్ర‌మిస్తున్నాన‌ని' అన్నాడు. ఓపెన‌ర్‌గానే కాక మిడ‌ల్ఆర్డ‌ర్‌లో కూడా రాణించ‌గ‌ల‌గ‌డం త‌నకు క‌లిసొస్తుంద‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశాడు.

Next Story
Share it