గ్రేటర్‌ హైదరాబాద్‌లో ముంచెత్తిన వరదలు.. పలు రోడ్లు మూసివేత

By సుభాష్  Published on  18 Oct 2020 1:15 PM IST
గ్రేటర్‌ హైదరాబాద్‌లో ముంచెత్తిన వరదలు.. పలు రోడ్లు మూసివేత

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా హైదరాబాద్‌ నగరంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వర్షాల కారణంగా నగరమంతా జలమయమైంది. లోతట్టు ప్రాంతాల్లోన్ని పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. పలు నీళ్లు నీటిలో మునిగిపోవడంతో కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. కాలనీల్లోకి వరదనీరు రావడంతో రాత్రుల్లో సైతం కంటినిండ నిద్రలేకుండా బిక్కుబిక్కుమంటూ వెళ్లదీశారు. తరచూ వర్షాలతో భాగ్యనగరం అతలాకుతలం కావడంతో కొన్ని రోడ్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రకటించింది. మహానగరంలోని వివిధ జోన్లలో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లోని పలు రోడ్లను తాత్కాలికంగా మూసివేయడం ద్వారా ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు చేపట్టారు.

ఇక ఈస్ట్‌ జోన్‌లో మలక్‌పేట పోలీస్‌ స్టేషన్ పరిధిలో మలక్‌ పేట రోడ్‌ అండర్‌ బ్రిడ్జి, గడ్డి అన్నారం నుంచి శివగంగా థియేటర్‌ రోడ్డు, మూసారాంబాగ్‌ కాజ్‌వే, చాదర్‌ఘాట్‌ కాజ్‌వేలను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అలాగే ఈస్ట్‌ సెంట్రల్‌ జోన్‌ పరిధిలో గోషామాహల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని 100 ఫీట్ల రోడ్డు, పురాణాపూరల్‌ వరకు మూసివేశారు. టోలీచౌకీ పోలీసు స్టేషన్‌ పరిధిలో టోలీచౌక్‌ ఫ్లై ఓవర్‌ కింద ట్రాఫిక్‌ను రద్దు చేశారు. ఇక సౌత్‌ జోన్‌ పరిధిలో ఫలక్‌నుమా పీఎస్‌పరిధిలో మోఘుల్‌ కాలేజ్‌, ఫలక్‌నుమా బండ్లగూడ నుంచి అరాంఘర్‌ రోడ్డు, ఎంబీఎన్‌ఆర్‌ చౌరస్తా నుంచి ఐఎస్‌ సదన్‌ రోడ్డు డీఎంఆర్‌ఎల్‌ చౌరస్తా వరకు, ఫలక్‌నుమా రైల్వే బ్రిడ్జి రోడ్లను మూసివేశారు.

ఉగ్రరూపం దాల్చిన మూసీ నది

శనివరాం రాత్రి కురిసిన భారీ వర్షానికి మూసీ నది మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. చాదర్‌ఘాట్‌ బ్రిడ్జితో సహా పక్కకు ఉన్న బస్తీలను సైతం మూసీనది ముంచేసింది. దీని కారణంగా దాదాపు 50కిపైగా ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయి. చాదర్‌ఘాట్‌ నుంచి మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌ ప్రధాన రోడ్లన్నీ మూసివేశారు. పక్కనే ఉన్న బస్తీలన్నీ నీటమునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. భారీ వరదల కారణంగా ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నా..ఏ అధికారులు వచ్చి చూడటం లేదని, పట్టించుకునే నాథుడే కరువయ్యారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిండుకుండలా తలపిస్తున్న హిమాయత్‌ సాగర్‌

భారీ వరదల కారణంగా హిమాయత్‌ సాగర్‌ నిండుకుండలా మారిపోయింది. ద రాత్రి కురిసిన వర్షానికి భారీగా వరదనీరు చేరడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. సాగర్‌ ఐదు అడుగుల మేర 12 గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు. ఇలా నగరంలో భారీ వరదలు ముంచెత్తడంతో లోతట్టు ప్రాంతాలన్ని పూర్తిగా మునిగిపోయాయి. చాలా మంది వరదల్లో చిక్కుకుని మృత్యువాత పడ్డారు. ఇక వాహనాలు సైతం వరదల్లో కొట్టుకోవడంతో భారీ నష్టం సంభవించింది.

Next Story