రేవంత్‌రెడ్డి భద్రతపై హైకోర్టులో పిటిషన్‌

మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి భద్రతకు సంబంధించి దాఖలు చేసిన పిటీషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రస్తుతం తనకు 2+2 భద్రత కల్పిస్తున్నారని, దానిని 4+4కు మార్చడంతో పాటు ఎస్కార్ట్‌ సదుపాయం కూడా కల్పించాలని రేవంత్‌రెడ్డి పిటిషన్‌లో కోరారు. 2007 నుంచి ప్రజాప్రతినిధిగా ఉంటూ ఉమ్మడి రాష్ట్రంతో పాటు, తెలంగాణ అవిర్భావం తర్వాత కూడా ప్రభుత్వాల ప్రజావ్యతిరేక నిర్ణయాలు, రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగే అంశాలపై పోరాటం చేస్తున్నానని, 2009 ఎన్నికల సందర్భంగా తనపై దాడి జరగడంతో అప్పటి ప్రభుత్వం 4+4 భద్రతను కల్పించిందని, ఇక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత దానిని 2+2కు కుదించారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ముఖ్యమంత్రితో రాజకీయంగా, వ్యక్తిగతం వైరం ఉంది

ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తనకు రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా వైరం ఉందని, కేసీఆర్‌ సారథ్యంలోని ప్రభుత్వ నిర్ణయాలపై తాను పోరాటం చేస్తున్నానని చెప్పుకొచ్చారు. టీఆర్‌ఎస్‌ నేతల వ్యవహారంతో పాటు సచివాలయం కూల్చివేత, రామేశ్వరరావుకు విలువైన భూ కేటాయింపులపై ఇప్పటికే పబ్లిక్‌ ఇంట్రెస్టెడ్‌ లిటిగేషన్‌ కేసులు వేసి పోరాడుతున్నానని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌ తనపై కక్షగట్టారని, బ్లూ స్టార్‌ ఆపరేషన్‌ చేసి తనను అంతమొందిస్తానని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్‌ హెచ్చరించిన విషయాన్ని కూడా పిటిషన్‌లో పేర్కొన్నారు.

రామేశ్వరరావు కూడా కేసులు వేశారు..

రామేశ్వరరావు తనపై పలు కేసులు కూడా వేశారని, ఎన్నికల సందర్భంగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నాపై, నా కుటుంబ సభ్యుల కదలికలపై నిఘా ఏర్పాటు చేశారన్నారు. గతంలోనే భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి, హోంశాఖకు లేఖ కూడా రాశానని, దానిపై ఎలాంటి స్పందన రాకపోవడంతో కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాల్సి వచ్చిందని అన్నారు. అయితే ఆ పిటిషన్‌పై 2016, జూన్‌ 16న మధ్యంతర ఉత్తర్వులు వచ్చాయని, ఆ ఉత్తర్వుల ఆధారంగానే తనకు భద్రత కల్పించాలనిన బాధ్యత కేంద్రంపైనే ఉండగా, లా అండ్‌ ఆర్డర్‌ తమ పరిధిలోని అంశం అని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వమే 4+4 భద్రత కల్పించించగా, అతికొద్ది రోజుల్లోనే ఆ భద్రతను తొలగించిందని రేవంత్‌రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఓ వైపు సీఎం ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో పాటు సీఎంకు అత్యంత సన్నిహితుడైన రామేశ్వరరావు అక్రమాలపై కూడా తాను న్యాయపోరాటం చేస్తున్నానని అన్నారు. దీంతో , కేసీఆర్‌, రామేశ్వరరావుల నుంచి నాకు ప్రాణహానీ ఉందని, అందుకే 4+4 కేంద్ర బలగాలతోపాటు ఎస్కార్ట్‌ ఇవ్వాలని రేవంత్‌రెడ్డి కోరారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.