ఓల్టా చట్టాన్ని ఉల్లంఘించారు.. క్రిమినల్‌ చర్యలు తీసుకోండి

By అంజి  Published on  3 March 2020 10:03 AM GMT
ఓల్టా చట్టాన్ని ఉల్లంఘించారు.. క్రిమినల్‌ చర్యలు తీసుకోండి

ముఖ్యాంశాలు

  • రేవంత్‌రెడ్డి భూ అక్రమాలపై అధికారుల విచారణ పూర్తి
  • అక్రమంగా కట్టుకున్న గోడలను కూల్చివేయాలని ఆర్డీవో నివేదిక
  • క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని నివేదిక

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి, కొండల్‌రెడ్డి భూ అక్రమాలపై రెవెన్యూ అధికారుల విచారణ పూర్తైంది. ప్రభుత్వ విచారణలో రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి అడ్డంగా దొరికారని సమాచారం. భూ అక్రమాలపై విచారణ చేసిన నివేదికను ఆర్డీవో చంద్రకళ.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు సమర్పించారు.

ఓల్టా చట్టం ఉల్లంఘించినందుకు క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని నివేదికలో పేర్కొన్నారు. అక్రమంగా కట్టుకున్న గోడలను కూల్చివేయాలని ఆర్డీవో తన నివేదిలో చెప్పారు. సర్వే నెంబర్‌ 127లో రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డిలు.. ఓల్టా చట్టం ఉల్లంఘించినట్టు అధికారులు సాక్ష్యాలతో సహా తేల్చారు. సర్వే నెంబర్‌ 127లో 5.5 ఎకరాలకు టైటిల్‌ లేనట్లు అధికారులు గుర్తించారు. రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి ఆధీనంలో ఉన్న 10.20 ఎకరాల భూమి అక్రమని అధికారులు చెప్పారు.

గోపనపల్లిలో వీరు అక్రమంగా భూ మ్యుటేషన్‌లు, కబ్జాలకు పాల్పడినట్టు రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఎకరం 36 గుంటల భూమిని అక్రమంగా మ్యుటేషన్‌ చేయించినట్లు తెలిసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాల ప్రకారం భూకబ్జాలకు సంబంధించి ఓల్టా చట్టాన్ని ఉల్లంఘించినందుకు రేవంత్‌రెడ్డి, కొండల్‌ రెడ్డిలపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని రాజేంద్రనగర్‌ ఆర్డీవో చంద్రకళ తన నివేదికలో పేర్కొన్నారు.

Next Story