మైహోం రాజేశ్వర్‌రావుకు ఎదురుదెబ్బ.. భూ కేటాయింపుపై హైకోర్టులో పిల్
By సుభాష్
మైహోం రాజేశ్వర్‌రావుకు ఎదురుదెబ్బ తగిలింది. మైహోంకు భూ కేటాయింపుపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాయదుర్గంలో వందల కోట్లు విలువ చేసే భూమిని మైహోంకు కేటాయించారని పిల్‌లో పేర్కొన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా రూ.38 కోట్ల స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇచ్చారని పిల్‌లో వివరించారు. కాగా, రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు.. మైహోం రాజేశ్వరరావుతో పాటు, ప్రభుత్వానికి, డీఎల్‌ఎఫ్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల పాటు విచారణనను వాయిదా వేసింది.
కాగా, రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, రాయదుర్గం గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 83లో 424 ఎకరాల భూమిని 2006లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 161 ద్వారా ఏపీ ఇండస్ట్రీయల్ అండ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ కార్పొరేషన్‌కు కేటాయించింది. ఏపీఐఐసీకి ఈ భూమిని కేటాయిస్తూ అప్పటి ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొందించింది. ఈ ల్యాండ్ ఐటీ జోన్ పరిధిలో ఉన్నందున దీనిని ఐటీ పార్క్, ఐటీకి సంబంధిత ఇన్ ఫ్రా నిర్మాణాల కోసం మాత్రమే వినియోగించాలని స్టేట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాలసీ ద్వారా స్పష్టంగా తెలిపింది.
ఈ నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టేందుకు డీఎల్‌ఎఫ్ లిమిటెడ్ అనే సంస్థ భూ కేటాయింపుల కోసం సర్కార్‌కు దరఖాస్తు చేసుకుంది. ఈ దరఖాస్తును షార్ట్ లిస్ట్ తయారు చేసి డీఎల్‌ఎఫ్ ట్రాక్ రికార్డును పరిశీలించి ఆ సంస్థకు ఏపీఐఐసీ నుంచి భూ కేటాయింపులకు అప్పటి సర్కార్ సానుకూలత వ్యక్తం చేసింది. దీంతో రేవంత్‌రెడ్డి పిల్‌పై హైకోర్టు నోటీసులు జారీ చేస్తూ, విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.