లాక్‌డౌన్ ఎఫెక్ట్: రిటైల్ రంగానికి రూ.5.5 లక్షల కోట్ల నష్టం
By సుభాష్ Published on 6 May 2020 10:30 AM ISTప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకూ దేశీయ రిటైల్ రంగానికి రూ.5.5లక్షల కోట్ల నష్టం ఏర్పడిందని అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య పేర్కొంది. భారత రిటైల్ రంగంలో ఏడు కోట్ల మందికిపైగా వ్యాపారులు ఉండగా, రిటైల్ వ్యాపారం రోజుకు రూ.15వేల కోట్లుగా ఉంది.
ప్రస్తుతం కరోనా వల్ల ఇలాంటి విపత్కర పరిస్థితుల కారణంగా వారిలో కనీసం 20శాతం రాబోయే రెండు నెలల్లో వ్యాపారాలు మూసివేసే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరిస్తూ వారందరినీ ఆదుకునేందుకు ఆకర్షనీయమైన ప్యాకేజీ ఇవ్వక తప్పదంటున్నారు.
దేశంలో మూడు విడతులగా కొనసాగుతున్న లాక్‌డౌన్ వల్ల పర్యాటక, అతిథ రంగం రూ.10 లక్షల కోట్లకు పైగా నష్టపోయినట్లు భారత టూరిజం, హాస్పిటాలిటీ సంఘాలు తెలిపాయి. మార్చి నెలలో రూ. 5 లక్షల కోట్లుగా అంచనా వేయగా, లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో ఆ నష్టం మరింత రెట్టింపయ్యిందన్నారు.
లాక్‌డౌన్ కారణంగా ఇలాంటి పరిస్థితులను తట్టుకోవడం కష్టతరమైందని, వర్తకులు తమ ఉద్యోగుల జీతాలు, షాపుల అద్దెలు చెల్లిస్తున్నారు. మరో వైపు కస్టమర్ల ఖర్చుల కారణంగా ఆదాయం మరింత తగ్గపోయింది. ఇలాంటి పరిణామాలతో వ్యాపారాలు సాధారణ స్థితికి రావాలంటే దాదాపు 8 నుంచి 10 నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే భారత్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర స్థాయిలో దెబ్బతింది. అన్ని రంగాల్లో డిమాండ్ తక్కువగా ఉంది.
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంచుకోవడం కష్టతరమనే చెప్పాలి. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోకపోతే ఈ రంగానికి ఊహించనంత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బిసి భాటియా పేర్కొంటున్నారు.
ఇక భారత్‌లోని 20శాతం మంది రిటైలర్లు షాపులను శాశ్వతంగా మూసివేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది. తమ రంగానికి బతికించుకోవడానికి వెంటనే ప్రభుత్వం ప్యాకేజీని అందించాలని కోరుతున్నారు. ఈ మేరకు తమను ఆదుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లకు సీఏఐటీ లేఖ రాసింది. ఏడు కోట్ల రిటైల్ ట్రేడర్లు ఉన్న 40వేల వ్యాపార సంఘాలతో సీఏఐటీ ఏర్పాటు చేశారు. కరోనా దెబ్బతో రిటైల్ రంగాన్ని కోలుకోలేని దెబ్బకొట్టిందని, ప్రభుత్వ సాయం లేకుండా ఈ నష్టాల నుంచి గట్టెక్కే పరిస్థితి లేదని చెబుతున్నారు.