చైనాకు తేల్చి చెప్పేశాం.. ఇక ఏమి జరుగుతుందో..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Sep 2020 1:37 PM GMT
చైనాకు తేల్చి చెప్పేశాం.. ఇక ఏమి జరుగుతుందో..?

భార‌త్-చైనా స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే..! ఇలాంటి సమయంలో మాస్కోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. చైనా రక్షణ మంత్రి వే ఫెంఝీతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పలు కీలక అంశాలను చర్చించారు. లడఖ్ సరిహద్దులో నెలకొన్న తాజా ఉద్రిక్తతలపైనా దాదాపు రెండున్నర గంటలపాటు చర్చించారు. భారత్ చైనాకు చెప్పిన అంశాల‌ను భారత ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది.

చైనా రెచ్చగొడితే భారత్ చూస్తూ ఉండదని రాజ్ నాథ్ సింగ్ తేల్చి చెప్పారు. భారత సార్వభౌమత్వానికి, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగిస్తే.. భారత్ ఎలాంటి చర్యలైనా తీసుకుంటుందని చైనాకు రాజ్ నాథ్ సింగ్ స్ప‌ష్టం చేశారు. చైనా త‌మ దళాలను మోహరిస్తూ దూకుడుగా ప్రవర్తించడాన్ని‌ వ్యతిరేకించడమే కాకుండా.. స‌రిహ‌ద్దుల వ‌ద్ద‌ యథాతథ పరిస్థితిని కొనసాగించాలన్న ఒప్పందాలను చైనా ఉల్లంఘిస్తోంద‌ని భారత్ చెప్పినట్లు తెలుస్తోంది. సరిహద్దు భద్రత విషయంలో భారత సైన్యం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని.. ఇరు దేశాధినేతల మధ్య కుదిరిన ఏకాభిప్రాయాల్ని అమలు చేయాలని అన్నారు.

చైనా అలా చెబుతోంది:

సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు భారత్ వైఖరే కారణమని చైనా ఆరోపించింది. సరిహద్దుల్లో భారత్ భూభాగాన్ని ఆక్రమించాలని చైనా ప్రయత్నిస్తుంటే భారత్ అడ్డుకుంటుండగా.. తాము ఒక్క ఇంచు భూమిని కూడా కోల్పోవడానికి సిద్దంగా లేమని చైనా తనదైన శైలిలో ఆరోపణలు చేస్తోంది. తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి తమ సైనికబలగాలు సిద్ధంగా ఉన్నాయని.. వివాదాన్ని ఇరు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకుందామని చైనా అంటోంది.

తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్ సరస్సు వద్ద భారత్‌, చైనాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 29, 30 తేదీల్లో భారత భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి చైనా సైన్యం చేసిన ప్రయత్నాలను భారత్ తిప్పికొట్టింది. చైనా ఎలాంటి దుస్సాహసానికి ఒడిగట్టినా దీటుగా తిప్పికొట్టేలా పటిష్ఠ వ్యూహాన్ని భారత్ సిద్ధం చేసింది. పాంగాంగ్‌ సరస్సు దక్షిణ తీరంలో ఎత్తయిన వ్యూహాత్మక ప్రాంతాలను తన ఆధీనంలోకి భారత్ తెచ్చుకుని చైనాకు షాక్ ఇవ్వగా.. మిగిలిన ప్రాంతాల్లో కూడా అదే పట్టును కొనసాగిస్తోంది. ఉత్తర తీరంలోని ఫింగర్‌-4‌ను చైనా ఆక్రమించుకోగా ఆ ప్రాంతంలోని ఇతర పర్వత శిఖరాలను భారత్ స్వాధీనంలోకి తెచ్చుకుంది.

Next Story
Share it