కరెన్సీ నోట్లతో కరోనా..! అయితే ఇలా చేయండి అంటున్న ఆర్‌బీఐ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 March 2020 2:15 PM IST
కరెన్సీ నోట్లతో కరోనా..! అయితే ఇలా చేయండి అంటున్న ఆర్‌బీఐ

కరోనా వైరస్‌(కొవిడ్‌-19) దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. కరోనా వైరస్‌ ప్రస్తుతం శరవేగంగా విస్తరిస్తుంది. ఇప్పటికే ఈ మహమ్మారి ధాటికి 7వేల మందికి పైగా మృత్యువాత పడగా.. లక్షకు పైగా దీని బాధితులున్నారు. మన దేశంలోనూ కరోనా బాధితుల సంఖ్య 125కు చేరింది. ఇప్పటి వరకు ముగ్గురు ఈ మహమ్మారి వల్ల చనిపోయారు. ఇదిలా ఉంటే.. కరెన్సీ నోట్ల ద్వారా కూడా కరోనా వైరస్‌ వ్యాపించే అవకాశం ఉంది. తాము చెప్పినట్లు చేస్తే వైరస్‌ భారిన పడకుండా తప్పించుకుకోవచ్చు అంటోంది ఆర్‌బీ(రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా) ప్రజలందరూ.. కాంటాక్ట్‌లెస్ పేమెంట్ సిస్టమ్స్‌ను ఉపయోగించాలని కోరుతోంది.

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సోషల్ కాంటాక్ట్‌కు దూరంగా ఉండాలని, పబ్లిక్ ప్లేసులకు వెళ్లొద్దని ఆర్‌బీఐ సూచించింది. దీని కోసం ఇంటి వద్ద నుంచే మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, కార్డ్స్ వంటి వాటితో ఆన్‌ ఛానల్స్ ద్వారా డిజిటల్ పేమెంట్స్ నిర్వహించొచ్చని వివరించింది. చెల్లింపుల కోసం నగదు పద్దతిలో కాకుండా ఆన్‌లైన్‌ లావాదేవీలను ఎక్కువగా వాడాలని సూచిస్తోంది. వీటి ద్వారా సులభంగా నగదు చెల్లింపులతో పాటు కరోనా వైరస్‌ వ్యాపించకుండా ఉంటుందని చెప్పింది. పేమెంట్ చెల్లింపుల కోసం నెఫ్ట్, ఐఎంపీఎస్, యూపీఐ, బీబీపీఎస్ వంటి విధానాలను ఉపయోగించాలని సూచిస్తోంది. ఈ సేవలు రోజులో ఎప్పుడైనా అందుబాటులో ఉంటాయని తెలిపింది. మనీ ట్రాన్స్‌ఫర్, వస్తువులు/ప్రొడక్టుల కొనుగోలు, బిల్లు పేమెంట్స్ వంటి వాటికి ఈ నాన్ క్యాష్ డిజిటల్ పేమెంట్ ఆప్షన్‌ను ఉపయోగించొచ్చని పేర్కొంది.

కరోనా వైరస్ ఉన్న ప్రాంతాన్ని తాకిన తర్వాత కళ్లు, నోరు, ముక్కు వంటి వాటిని తాకినప్పుడు కూడా వైరస్ సోకే ప్రమాదముందని నిపుణులు పేర్కొంటున్నారు. అందువల్ల కరోనా వైరస్ వ్యాప్తి నుంచి తప్పించుకోవడానికి కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ కూడా ఎంతగానో ఉపయోగపడతాయని గుర్తించాలి.

Next Story