కరోనా నుంచి కోలుకున్న వారు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 Oct 2020 7:21 PM ISTప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన ఎంతో మంది పడ్డారు. ఒక్కసారి కరోనా బారిన పడిన వారు మళ్ళీ కరోనా బారిన పడితే ఏమి జరుగుతుందో అన్న టెన్షన్ కూడా లేకపోలేదు. అందుకే పరిశోధనలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారిలో ఉండే యాంటీబాడీ (ప్రతిరక్షకాలు)ల దాదాపు మూడు నెలల పాటు ప్రతిరక్షకాలు ఉంటాయని చెప్పారు.
అమెరికాలోని భారత సంతతి శాస్త్రవేత్త దీప్తా భట్టాచార్య మాత్రం మరో ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో సుమారు ఐదు నుంచి ఏడు నెలలపాటు యాంటీబాడీలు ఉంటాయని, మళ్లీ కరోనా సోకకుండా అవి కాపాడతాయని అంటున్నారు. దీప్తా భట్టాచార్య నేతృత్వంలో అరిజోనా వర్సిటీ పరిశోధకుల బృందం జరిపిన అధ్యయనంలో భాగంగా ఈ ఫలితాలు తేలాయి.
కరోనా నుంచి కోలుకున్న 6,000 మందిలో కొన్ని నెలలపాటు యాంటీబాడీలు విడుదలయ్యే తీరుపై అధ్యయనం చేశారు. కొందరిలో గరిష్ఠంగా రెండేళ్ల వరకు కూడా ఆ వ్యాధినిరోధకత ఉంటుందని అంచనా చేశారు. కొందరిలో కరోనా పాజిటివ్ నిర్ధారణ వచ్చి కోలుకున్న నెలకే మళ్లీ పాజిటివ్ వచ్చిన ఘటనలు అందరినీ టెన్షన్ పెడుతూ ఉన్నాయి. అయితే రెండో సారి కరోనా సోకడం వలన మనుషుల మీద పెద్దగా ప్రభావం చూపదని అంటున్నారు.