జులైలో ఒలింపిక్స్..!
By తోట వంశీ కుమార్ Published on 30 March 2020 6:19 PM ISTకరోనా వైరస్(కొవిడ్-19) రోజు రోజుకు విజృంభిస్తోంది. కరోనా ముప్పుతో ఏడాది పాటు వాయిదా పడ్డ టోక్యో ఒలింపిక్స్ 2021 జులైలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని జపాన్ మీడియా ఆదివారం ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దాటి ఒలింపిక్స్ కోసం సిద్దం కావాలంటే సమయం పడుతుందని, కాబట్టి వచ్చే ఏడాది జులై 23న ఈ మెగా క్రీడలను ఆరంభించే వీలుందని ఆదేశ మీడియా ఎన్‌హెచ్‌కే తెలిపింది.
మరోవైపు క్రీడల నిర్వహణ తేదీలపై స్పష్టత కోసం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ)తో యొషిరో సారథ్యంలోని టోక్యో 2020 నిర్వాహక కమిటీ చర్యలు కొనసాగిస్తోందని, మరో వారంలోపు తుది నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందని అక్కడి ఓ వార్తాపత్రిక ప్రచురించింది.
తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే రోజుల్లో క్రీడలను నిర్వహిస్తే మారథాన్ లాంటి రేసుల్లో పాల్గొనే అథ్లెట్లకు ప్రయోజనం చేకూరుతుందని టోక్యో గవర్నర్ యురికో ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కాగా.. అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించిన తరువాత ఒలింపిక్స్ తేదీలపై ఓ నిర్ణయానికి వస్తామని ఇదివరకే ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాక్ చెప్పిన సంగతి తెలిసిందే.