రిప‌బ్లిక్ డే వేడుక‌ల‌కు రాష్ట్రాల నుంచి ఎంపిక చేసే శ‌క‌టాల అంశంలో ఎలాంటి రాజ‌కీయాలు, ప‌క్ష‌పాతానికి చోటు లేద‌ని కేంద్ర‌ప్ర‌భుత్వ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. కొన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు త‌మ త‌ప్పును క‌ప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నాయ‌ని, ఇలాంటి అంశాల‌ను ఎత్తిచూపుతూ ప్ర‌జ‌ల‌కు కేంద్రంపై త‌ప్పుగా అర్థం చేసుకునేలా వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని ఆరోపిస్తున్నాయి. కాగా, ఈ ఏడాది అన్ని జ‌న‌వ‌రి 26న జ‌రిగే రిప‌బ్లిక్ వేడుక‌ల్లో ప‌శ్చిమ‌బెంగాల్ శ‌క‌టం అనుమ‌తిని కేంద్ర రక్ష‌ణ మంత్రిత్వ‌శాఖ నిరాక‌రించింది. ప‌శ్చిమ‌బెంగాల్‌తో పాటు మ‌హారాష్ట్ర శ‌క‌టానికి కూడా స్థానం ద‌క్క‌లేదు. కాగా, దీని వెనుక కేంద్రం ఏదో కుట్ర చేస్తోంద‌ని ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆరోప‌ణ‌లు గుప్పించాయి.

ఈ ఆరోప‌ణ‌ల‌పై కేంద్రం ఈ విధంగా స్పందించింది. ఇక ప‌శ్చిమ‌బెంగాల్లో శాంతిభ‌ద్ర‌త‌లు స‌రిగ్గా లేవ‌ని, మ‌హారాష్ట్ర‌లో మంత్రి ప‌దవులు ద‌క్క‌ని వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌ని, ఈ విధంగా కేంద్రంపై చెడు ప్ర‌భావం చూపించే విధంగా ఇలా శ‌క‌టాల పేరుతో రాజ‌కీయం చేస్తున్నాయ‌ని కేంద్రం ఆరోపించింది. రిప‌బ్లిక్‌డే సంద‌ర్భంగా ఆయా రాష్ట్రాల శ‌క‌టాల ప్ర‌ద‌ర్శ‌న ఎంపిక విష‌యంలో న్యాయ‌బ‌ద్దంగానే జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేసింది.

ఈ శ‌క‌టాల ఎంపిక కూడా పెయింటింగ్‌, సంగీతం, క‌ళ‌లు, సంస్కృతి, ఆర్కిటెక్చ‌ర్‌, కొరియా గ్రాఫీ నిపుణుల క‌మిటీ ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతుంద‌ని కేంద్రం తెలిపింది. కాగా, 2020 సంవ‌త్స‌రానికి గాను రాష్ట్రాలు, కేంద్ర‌పాలిన ప్రాంతాలు, మంత్రిత్వ‌శాఖ‌ల నుంచి 56 శ‌క‌టాలు రాగా, అందులో 32 శ‌క‌టాల‌ను నిపుణుల క‌మిటీ ఎంపిక చేసింది. ఇందులో కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు శ‌క‌టాల‌కు చోటు ద‌క్కించుకోలేక‌పోగా, ఇక బీజేపీ పాల‌న‌లో లేని మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, ఒడిశా, పంజాబ్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, రాజ‌స్థాన్ రాష్ట్రాలు ఎంపిక‌య్యాయి.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.