ఏమిటీ రెమ్ డెసివిర్? నెలాఖరుకు దేశానికి వచ్చేస్తుందా?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Jun 2020 6:26 AM GMTమాయదారి మహమ్మారితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రపంచానికి కొంతమేర ఉపశమనం కలిగించే ఔషధంగా రెమ్ డెసివిర్ ను భావిస్తున్నారు. ఇన్వెస్టిగేషనల్ డ్రగ్ గా పేరున్నఈ ఇంజెక్షన్ ను ఈ నెలాఖరు నాటికి మన దేశంలో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. అమెరికాకు చెందిన గిలీడ్ సైన్సెస్ సంస్థ తయారు చేసిన ఈ ఔషధానికి అమెరికా ఔషధ నియంత్రణ మండలి (యూఎస్ఎఫ్డీఏ) అత్యవసరవేళలో వినియోగించేందుకు వీలుగా అనుమతులు ఇవ్వనుంది. తుది అనుమతి ఇంకా రాకున్నా.. త్వరలోనే ఇస్తారని చెబుతున్నారు.
అయితే.. అనుమతి వచ్చే నాటికి పెద్ద ఎత్తున అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా దేశీయంగా సిప్లా.. జుబిలెంట్ లైఫ్ సైన్సెస్.. హెటెరో ల్యాబ్స్ తో పాటు.. డాక్టర్ రెడ్డీస్.. జైడస్ క్యాడిలాతో ఒప్పందాలు చేసుకుంది. ఈ ఔషధాన్ని మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 127 దేశాల్లో అమ్మేందుకు ఈ కంపెనీలకు ఉంటుంది.
అంతేకాదు.. ఔషధాన్ని తయారు చేసేందుకు అవసరమైన సాంకేతికత కూడా గిలీడ్ నుంచి ఈ కంపెనీలకు బదిలీ కానుంది. దీంతో రెమ్ డెసివిర్ తయారీ.. అమ్మకాల కోసం మన దేశంలో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఈ సంస్థ నుంచి అనుమతులు రావాల్సి ఉంది. త్వరలోనే వచ్చేస్తాయని చెబుతున్నారు.
ఇంతకీ ఈ ఔషధాన్ని ఎవరికి వాడతారన్న విషయంలోకి వెళితే.. మాయదారిరోగం పాజిటివ్ అని తేలిన బాధితులు త్వరగా కోలుకునేందుకు దీన్ని వాడతారు. మాయదారి వైరస్ ఒక వ్యక్తి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఎంతో త్వరగా విస్తరిస్తుంది. తొలుతఊపిరితిత్తుల్లోకి తర్వాత ఉదర భాగంలోకి వెళ్లి స్థిరపడుతుంది. రోగ నిరోధక శక్తిని దెబ్బ తీస్తుంది. ఇతర జబ్బులు దాడికి అవకాశం ఉంటుంది.
రెమ్ డెసివిర్ ఔషధంతో శరీరంలో వైరస్ లోడ్ తగ్గించే వీలు ఉంటుందని చెబుతున్నారు. దీన్ని ఇంజెక్షన్ పౌడర్ రూపంలోనూ.. ఐవీ ఫ్లూయిడ్ ద్వారా వైద్యుల సమక్షంలో మాత్రమే బాధితుడికి ఇవ్వాల్సి ఉంటుంది. తొలిరోజు రెండు డోసులు.. ఆ తర్వాత నాలుగు రోజులపాటు ఒక్కో డోసు చొప్పున ఇస్తే ఫలితం ఉంటుందని చెబుతున్నారు. ఇక.. ఖర్చు విషయానికి వస్తే.. ఇది ఖరీదైందిగా చెబుతున్నారు.
ఐదు రోజుల చికిత్స కోసం దాదాపు రూ.40వేల వరకు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వారు మాత్రం పది రోజుల పాటు చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. ఇన్వెస్టిగేషనల్ డ్రగ్ కావటంతో ఈ మందును రోగికి తప్పనిసరి అయితే మాత్రమే వాడాలి. అంతేకానీ.. ఎవరికి పడితే వారు వాడేస్తామంటే కుదరదు. అయితే.. ఈ మందు ప్రభావం ఎలా ఉంటుందన్న విషయాన్ని ఆసుపత్రుల వైద్యులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి తమ వద్ద భద్రంగా ఉంచాల్సి ఉంటుంది. గుడ్డి కంటే మెల్ల నమయమన్నట్లు.. ఏ మందు లేని వేళ.. అత్యవసర వేళ ఆదుకునే ఈ మందు ఎంతో ప్రయోజనకారిగా మారుతుందని చెప్పక తప్పదు.