వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం మార్గదర్శకాలు విడుదల
By న్యూస్‌మీటర్ తెలుగు
అమరావతి: వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం విస్తరణకు సంబంధించి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. రూ. 5లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి కూడా వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకానికి వర్తింప చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అన్ని రకాల బియ్యం కార్డులు కలిగిన వారు అర్హులని ప్రభుత్వం తెలిపింది. వైఎస్సార్ పెన్షన్, జగనన్న విద్యా, వసత దీవెన కార్డు ఉన్నవారు కూడా ఈ పథకానికి అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. 12 ఎకరాల కన్నా తక్కువ తడి భూమి, 35 ఎకరాల కన్నా తక్కువ పొడి భూమి ఉన్నా భూ యజమానులు అర్హులని తెలిపింది. తడి, పొడి భూములు కలిపి మొత్తం 35 ఎకరాలు కన్నా తక్కువ ఉన్నా వారందరూ అర్హులు. రూ.5 లక్షల వరకు ఆదాయపు పన్ను దాఖలు చేస్తున్న కుటుంబాలు కూడా ఈ పథకానికి అర్హులుగా ప్రకటించింది. మునిసిపల్ ఆస్తి పన్ను చెల్లించే కుటుంబాలకు, రూ.5లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, పార్ట్‌టైమ్ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు అర్హులని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ రంగంలో పని చేస్తున్న గౌరవ వేతనం ఆధారిత ఉద్యోగులు, ప్రైవేట్ రంగ ఉద్యోగులు వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకానికి అర్హులుగా ప్రకటించింది. కుటుంబంలో ఒక కారు కన్నా ఎక్కువగా ఉంటే పథకానికి అనర్హులని ప్రభుత్వం తెలిపింది.