'డ్రాగన్ ఫ్రూట్'కు పేరు మార్పు.. ఎందుకో తెలుసా?
Dragon Fruit Is Renamed Kamalam In Gujarat. చూడగానే నోరూరించే విధంగా ఎంతో ఎర్రగా ఉండే డ్రాగన్ ఫ్రూట్ ప్రస్తుతం పేరు కమలంగా మార్పు.
By Medi Samrat
చూడగానే నోరూరించే విధంగా ఎంతో ఎర్రగా ఉండే డ్రాగన్ ఫ్రూట్ ప్రస్తుతం పేరు మార్చుకోబోతుందని తెలుస్తోంది. ఈ పండును డ్రాగన్ ఫ్రూట్ అని పిలవడం వల్ల చైనాకు పర్యాయపదంగా వస్తుందని.. అందుకోసమే దీనికి పేరు మార్చాలని గుజరాత్ సీఎం తెలిపారు. చూడగానే ఎర్రటి రంగులో, తామర పువ్వును తలపించేలా ఉన్న ఈ పండుకు కమలంగా పేరు మార్చాలని తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది.
గుజరాత్ సీఎం హార్టికల్చర్ డెవలప్మెంట్ మిషన్ ను ప్రారంభించిన అనంతరం ఈ విషయాన్ని తెలియజేశారు. డ్రాగన్ ఫ్రూట్ ను కమలం పండుగా పిలిచేందుకు పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలియజేశారు. డ్రాగన్ అనే పేరు చైనాతో ముడిపడి ఉండటంవల్ల ఈ మేరకే ఈ పండు పేరును మార్చుతూ నిర్ణయం తీసుకున్నట్లు గుజరాత్ ముఖ్యమంత్రి తెలియజేశారు. ఈ పేరు మార్చడం వెనుక మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బిజెపి పార్టీ గుర్తు కూడా కమలం కావడంతో ఈ పండుకు ఆ పేరును నిర్ణయించారు. అంతేకాకుండా గాంధీనగర్లోని గుజరాత్ బిజెపి ప్రధాన పార్టీ కార్యాలయానికి" శ్రీ కమలం"అనే పేరును కూడా పెట్టారు.
ఎన్నో పోషక విలువలతో కూడిన ఉష్ణ మండల ప్రాంతాలలో పెరిగే అమెరికాకు చెందిన ఈ పండును ప్రస్తుతం భారతదేశంలో వివిధ ప్రాంతాలలో కూడా సాగు చేస్తున్నారు. ఈ డ్రాగన్ ఫ్రూట్ భారతదేశంలో కిలో దాదాపు 350 నుంచి 500 రూపాయల వరకు విక్రయిస్తుంటారు. ఈ పండును తినటం వల్ల ఎన్నో రకాల క్యాన్సర్ల నుంచి విముక్తి పొందవచ్చు. ఆస్తమా, డయాబెటిక్ వంటి వ్యాధులతో బాధపడేవారికి ఈ ఫ్రూట్ ఎంతో ఉపయోగపడుతుంది.