వయసు 85 ఏళ్లు.. అయినా ఆ పరుగు ఆపడు
By సుభాష్
సాధారణంగా రన్నింగ్‌లో రికార్డ్ సృష్టించిన వారు యువకులు, లేదా ఎక్కువ వయసు లేనివారే ఉంటారు. అదే వృద్ధులైతే ఈ కాలంలో ఏదో చిన్నా చితక పని చేసుకుంటూ విశ్రాంతి తీసుకుంటారు. కానీ ఓ 85 ఏళ్ల వృద్దుడు రిన్నింగ్‌లో రికార్డ్ సృష్టించాడు. ఏపీలోని కృష్ణా జిల్లా కోడూరు మండలం పిట్టల్లంక గ్రామానికి చెందిన చింతా రామస్వామి.. పరుగు పందేలలో పతకాలు సాధిస్తూ రికార్డ్ సృష్టిస్తున్నాడు. రామస్వామి ఏపీ రిజర్వ్ పోలీస్ విభాగంలో సబ్ ఇన్స్ పెక్టర్‌గా పని చేశారు. 1993లో పదవీ విరమణ చేశారు.
ఆ తర్వాత రన్నింగ్ మొదలుపెట్టి ఇప్పటి వరకు రాష్ట్ర, జాతీయ స్థాయిలలో నిర్వహించిన రన్నింగ్ పోటీలలో దాదాపు 40 పతకాలను గెలుచుకున్నారు. ఇటీవలే మణిపూర్‌లో జరిగిన ఐదు కిలోమీటర్ల పరుగు పందెంలో రామస్వామి బంగారు పతకం సాధించారు. రామస్వామి ప్రతి రోజు క్రమం తప్పకుండా రన్నింగ్, వాకింగ్, వ్యాయమాలు చేస్తుంటారు. ఎక్కడికి వెళ్లాలన్నా.. ఎంత దూరం ప్రయాణించాలన్నా సైకిల్‌మీదే వెళ్తుంటారట. ఆరోగ్యంగా ఉండేందుకు రన్నింగ్ చేస్తున్నానని రామస్వామి చెప్పుకొస్తున్నాడు.
తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, పది కిలోమీటర్ల దూరమైనా ఎలాంటి ఆయాసం, ఇబ్బంది పడకుండా పరుగెత్తుతానని రామస్వామి చెబుతున్నాడు. తాను ఇంత వయసు వచ్చినా.. ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి రోజు రన్నింగ్, వాకింగ్ చేయడం వల్లనేనని చెబుతున్నాడు.