రికార్డు స్థాయిలో కేసులు.. ఒక్క రోజులో 5609 కరోనా పాజిటివ్ కేసులు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 May 2020 11:05 AM ISTగడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5609 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక వైరస్ కారణంగా మృతిచెందిన వారు 132మంది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 112359కి చేరుకున్నది. దీంట్లో యాక్టివ్ కేసులు 63624 ఉన్నాయి. 45, 299 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో మొత్తం మరణాల సంఖ్య 3435కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కరోనా మరణాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా... రెండోస్థానంలో గుజరాత్, మూడోస్థానంలో మధ్యప్రదేశ్ ఉన్నాయి. భారత్‌లో రికవరీ రేటుపై కేంద్ర వైద్యఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచ జనాభాను పరిగణనలోకి తీసుకుంటే లక్ష మందిలో 62 మంది కరోనా బారిన పడ్డారని ఆయన తెలిపారు.
ఇదిలావుంటే.. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుంది. నిన్న మహారాష్ట్రలో అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే ఏకంగా 2250 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 65 మంది మరణించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో కరోనాతో ఇప్పటివరకూ మహారాష్ట్రలో 1390 మంది మృత్యువాత పడ్డారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 50 లక్షలు దాటింది. బ్రెజిల్‌లో పరిస్థితి దారుణంగా ఉన్నది.