పేదలను ఆదుకునేందుకు విరాళాలిచ్చిన రీ(య)ల్ హీరోలు
By రాణి Published on 24 March 2020 5:35 PM GMTప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనాను కట్టడి చేసేందుకు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు తమకు తోచినంత విరాళాలిచ్చారు. ముందుగా టాలీవుడ్ యువ హీరో నితిన్ రూ.10 లక్షల చెక్కును తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి అందజేశారు. అందరికన్నా ముందే నితిన్ స్పందించి స్వచ్ఛందంగా విరాళం మివ్వడంతో అభిమానులతో పాటు..అంతా నితిన్ ను పొగడ్తలతో ముంచెతుత్తున్నారు.
Also Read : ఏపీలో 8కి చేరిన కరోనా కేసులు
నితిన్ తర్వాత..సూపర్ స్టార్ రజనీ కాంత్ ఫిలిం ఎంప్లాయిస్ సౌత్ ఇండియా ఆఫ్ ఫెడరేషన్ కు రూ.50 లక్షలు విరాళమిచ్చారు. ఇక రజనీ బాటలోనే విజయ్ సేతుపతి కూడా నడిచారు. ఇదే ఫెడరేషన్ కు ఆయన రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు. వీరికన్నా ముందు సూర్య, కార్తీక్, శివకుమార్ లు కలిసి రూ.10 లక్షల విరాళమిచ్చారు. కరోనా ప్రభావంతో దాదాపు షూటింగ్ లన్నీ నిలిచిపోయాయి. రాష్ట్రాలు లాక్ డౌన్ అయ్యాయి. దీంతో వేలమంది సినీ కార్మికులు కనీసం కూరగాయలు కొనుక్కునేందుకు కూడా డబ్బులేక ఇబ్బంది పడుతున్నారని ఎఫ్ఈఎఫ్ఎస్ఐ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి మీడియాతో చెప్పారు. దీనిపై స్పందించిన ఈ రీల్ హీరోలు తమ వంతు సాయమందించి రియల్ హీరోలుగా నిలిచారు. సినీ హీరోలు, నటులు అందజేసిన విరాళాలతో బియ్యం బస్తాలు, నిత్యావసరాలను కొనుగోలు చేసి పంచిపెడతామని చెప్పారు సెల్వమణి.
Also Read : 12 నిమిషాలకో బాధితుడు మృతి
ఇక విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ అయితే తన ఇంట్లో పనివారికి, వ్యక్తిగత సిబ్బందికి మే నెల వరకూ జీతాలను ముందుగానే చెల్లించేశారు. మీరు కూడా మీ చుట్టుపక్కలున్నవారికి వీలైనంత సహాయం చేయండంటూ ప్రకాష్ రాజ్ పిలుపునిచ్చారు. అలాగే తాను నటిస్తోన్న మూడు చిత్రాలకు పనిచేస్తోన్న సిబ్బందికి కూడా కనీసం సగం జీతాలనైనా ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు ఆయన ట్వీట్ చేశారు.
Also Read : యుగయుగాల ఉగాది
ఇక సినీనటుడు, మాజీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా ఉచితంగా కూరగాయలను పంపిణీ చేస్తున్నారు. మొయినాబాద్ సమీపంలో తనకున్న వ్యవసాయక్షేత్రంలో పండిన కూరగాయలను సన్నిహితులకు, నిరుపేదలకు పంచిపెడుతూ తన ఉదారతను చాటుకున్నారు. ఇలా సినీ రంగానికి చెందిన ప్రముఖులు తమకు తోచిన సహాయం చేస్తూ..మిగతా కళాకారులు కూడా స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.