ఆర్‌సీబీ కల నిజమైంది.. సన్‌రైజర్స్‌ను ఓడించి మరీ ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది
By తోట వంశీ కుమార్ Published on 26 May 2020 1:37 PM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2008లో ప్రారంభమైంది. ఇప్పటి వరకు 12 సీజన్లు జరుగగా రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు ఒక్క సారి కూడా ఐపీఎల్ టైటిల్‌ను సాధించలేదు. ప్రతి సారీ కప్పు మనదే అంటూ అభిమానులు ఆశపడడం చివరకు నిరాశపడడం షరా మాములే. అయినప్పటికి ఇప్పటికి కూడా ఆర్‌సీబీ ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో ఢోకా లేదు. హేమాహేమీలు ఆ జట్టు సొంతం. ఓ విరాట్ కోహ్లీ, డివిలియర్స్ వంటి ఆటగాళ్లు క్షణాల్లో మ్యాచ్‌లను ప్రత్యర్థి చేతుల్లోంచి లాక్కోగలరు. అయినా ఎందుకనో ఐపీఎల్ ట్రోఫీ ఆర్‌సీబీకి అందని ద్రాక్షగానే మిగిలింది.
అయితే.. ఐపీఎల్-13వ సీజన్(ఐపీఎల్-2020) సీజన్ ట్రోఫీని ఆర్‌సీబీ సొంతం చేసుకుందట. ఈ విషయాన్ని ఆ జట్టు స్వయంగా వెల్లడించింది. అదేంటి కరోనా కారణంగా ఐపీఎల్ 2020 సీజన్ నిరవధికంగా వాయిదా పడింది గదా.. ఎప్పుడు మ్యాచ్ లు జరిగాయనేగా మీ డౌట్. మీ సందేహాలు నిజమే కానీ.. సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి మరీ ఆర్‌సీబీ కప్పు గెలించిందట. ఎలాగంటే..
కరోనా కారణంగా ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో సగటు క్రీడాభిమాని నిరాశకు గురైయ్యాడు. అయితే.. ఈ క్రమంలో ఆర్‌సీబీ వినూత్నంగా ఆలోచించింది. ముందుగా ప్రకటించిన ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం రోజు వారి మ్యాచ్‌లను సంబంధించి ఓటింగ్ పద్దతిలో మ్యాచ్‌లను నిర్వహించి విజేతలను నిర్ణయించింది. దీనికి ఇండియన్ పోలింగ్ లీగ్ అని పేరుకూడా పెట్టుకుంది. అలా అన్ని జట్ల మధ్య ప్రతీరోజూ ఆన్‌లైన్‌లో ఓటింగ్ పద్ధతిలో మ్యాచ్‌లు నిర్వహించి విజేతలను ప్రకటించింది.
లీగ్ దశ నుంచి ఫ్లైఆఫ్ మ్యాచ్‌లతో పాటు ఫైనల్‌కు ఆర్‌సీబీ దూసుకుపోయింది. ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఆర్‌సీబీ తలపడింది. సోమవారం జరిగిన పైనల్‌లో ఆర్‌సీబీ 85 శాతం ఓట్లతో విజేతగా నిలిచింది. ఈ విషయాన్ని ఆర్‌సీబీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. అంతేకాదండోయ్ తమకు ఓట్లు వేసి గెలిపించిన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పింది. ఇక ఆర్‌సీబీ ట్వీట్ పై పలెవెరె నోటిజన్లతో పాటు ఐపీఎల్‌లో విజయవంతమైన జట్టు చెన్నై సూపర్ కింగ్స్ స్పందించింది.
‘ఈ సాలా కప్ నమ్‌దే' (ఈ ఏడాది కప్ మనదే)ను అనుకరిస్తూ ‘ఈ ఏడాది కప్ మీదే’ అంటూ సీఎస్‌కే సరదాగా ట్వీట్ చేసింది. ఇక ఇలాగైనా గెలిచాం అంటూ మరికొందరు ఆర్సీబీ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు తెగ వైరల్ అవుతున్నాయి. అసలు విషయం తెలియక కొందరు క్రికెట్ ప్రేమికులు షాక్‌కు గురవుతున్నారు. అసలు నిజం ఇది. పాపం ఇలాగైన ఆర్‌సీబీ తన కలను నిజం చేసుకుందని అంటున్నారు కొందరు నెటీజన్లు.