రాయగిరి రైల్వేస్టేషన్‌ ఇకపై 'యాదాద్రి' గా..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Sep 2020 7:59 AM GMT
రాయగిరి రైల్వేస్టేషన్‌ ఇకపై యాదాద్రి గా..

తెలంగాణలోని రాయగిరి రైల్వేస్టేషన్‌ను రైల్వేశాఖ యాదాద్రిగా మార్పు చేసింది. ఈ మేరకు దక్షణ మధ్య రైల్వే ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర మంత్రిత్వ శాఖ సూచన మేరకు ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. నేటి నుంచి రాయగిరి రైల్వేస్టేషన్‌ను యాదాద్రి రైల్వేస్టేషన్‌గా పిలవనునన్నట్లు రైల్వేశాఖ స్పష్టం చేసింది. స్టేషన్‌ కోడ్‌ YADDగా నిర్ణయించినట్లు తెలిపింది.

యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని ప్రపంచస్థాయి ఆధ్మాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దుతున్న విషయం తెలిసిందే. యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణం, అభివృద్ధి పనులు పూర్తయితే దేశ నలుమూలల నుంచి రోజూ లక్ష మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ క్రమంలో ఘట్‌కేసర్‌ వరకు ఉన్న ఎంఎంటీఎస్‌ను రాయగిరి వరకు పొడిగించాలని, దీంతో పాటు రాయగిరి రైల్వేస్టేషన్‌ పేరును యాదాద్రి రైల్వే స్టేషన్‌గా మార్చాలని 2016లో తెలంగాణ సీఎం కేసీఆర్‌ కేంద్రాన్ని కోరారు. ఈ క్రమంలో ఎంఎంటీఎస్‌ను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్‌ పేరును కూడా మార్పు చేసింది. ఇందుకు సంబంధించి సెప్టెంబర్ 18న దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఉత్వర్వులు జారీ చేశారు. కాగా 2019 సెప్టెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వ గెజిట్‌లో పేరు మారుస్తూ ఆదేశాలు జారీ చేశారు.

సికింద్రాబాద్ నుంచి భువనగిరి తరువాత రాయగిరి రైల్వే స్టేషన్ ఉంటుంది. వాస్తవానికి ఈ స్టేషన్ లో ప్యాసింజర్ రైళ్లు మినహా మరే రైళ్లూ ఆగవు. అయితే, భవిష్యత్తులో ఈ రూట్లో వెళ్లే అన్ని రైళ్లకూ స్టాపింగ్ సౌకర్యం కల్పించేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయించింది

Next Story