ప్రభుత్వం వద్దని చెప్పినా.. ఆసీనే తీసిన రవిబాబు
By తోట వంశీ కుమార్ Published on 14 Jun 2020 8:16 AM ISTనటుడిగా ఎక్కువగా రొటీన్ పాత్రలే చేశాడు కానీ.. దర్శకుడిగా మాత్రం భలే వెరైటీ సినిమాలు తీశాడు రవిబాబు అల్లరి, అనసూయ, నచ్చావులే, అమరావతి, అవును.. ఇలాంటి విలక్షణ సినిమాలు తీశాడతను. ఐతే గత కొన్నేళ్లలో మాత్రం రవిబాబు నుంచి ఆయన స్థాయికి తగ్గ సినిమాలు రాలేదు. అవును-2, అదుగో, ఆవిరి.. ఇలా వరుసగా పేలవమైన సినిమాలు అందించాడు రవిబాబు. ఐతే సినిమా ఎలా ఉన్నా వాటిని ప్రమోట్ చేసే తీరులో రవిబాబు వైవిధ్యం చూపిస్తుంటాడు. మేకింగ్ దశ నుంచి ఆయన ప్రచారం వైవిధ్యంగా మొదలవుతుంది. తన కొత్త చిత్రం క్రష్ విషయంలోనూ ఆయన అదే శైలిని అనుసరిస్తున్నాడు. ఇటీవలే తెలంగాణలో షూటింగ్స్ పునఃప్రారంభమైన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా ముందుగా చిత్రీకరణ జరుపుకున్న చిత్రాల్లో రవిబాబు క్రష్ కూడా ఒకటి. ఈ సందర్భంగా రవిబాబు ఓ కౌగిలింత సీన్ చిత్రీకరించడం విశేషం. హీరోయిన్ని పెట్టి ఆ సీన్ ఎలా తీశాడో వివరిస్తూ రవిబాబు ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. అయితే కరోనా ముప్పు నేపథ్యంలో ముద్దులు, కౌగిలింతల సీన్లేవీ తీయొద్దని ప్రభుత్వం స్పష్టం చేసినా రవిబాబు ఇలా హగ్ సీన్ ఎలా తీశాడని సందేహం కలగడం ఖాయం. అయితే ఇక్కడే రవిబాబు మ్యాజిక్ చేశాడు. హీరోయిన్ ముందు ఎవరూ లేకుండానే ఒక అద్దాన్ని ఉంచి కౌగిలింత సీన్ తీశాడు. ముందు ఇలా సీన్ తీసి.. ఆ తర్వాత గ్రాఫిక్‌లో ఏమైనా అక్కడో వ్యక్తి ఉన్నట్లు సృష్టిస్తాడేమో తెలియదు మరి. మొత్తానికి ఈ న్యూస్‌తో రవిబాబు సినిమా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.