‘ఓడలు బండ్లు..బండ్లు ఓడలు ‘ అవుతాయంటారు. టీవీ 9 మాజీ సీఈవో రవి ప్రకాశ్ విషయంలో ఇదే నిజమే అనిపిస్తోంది. ఓ సాధారణ జర్నలిస్ట్‌గా జీవితాన్ని ప్రారంభించారు. జర్నలిజాన్ని ఉరుకులు పెట్టించారు. తెలుగులో 24 గంటల న్యూస్‌ ఛానల్‌ పెట్టి విజయపథంలో నడిపించారు. టీవీ 9 కన్నడ, టీవీ 9 మరాఠా ఇలా ఎన్నో ఛానళ్లతో తన పట్టిందల్లా బంగారమే అని నిరూపించారు. ఎలక్ట్రానికి మీడియాలో ఎంతో మంది పాత్రికేయులను తయారు చేశారు. ‘స్పీడ్ జర్నలిజం’కు కేరాఫ్ అడ్రస్ రవి ప్రకాశే అనే గుర్తింపు తెచ్చుకున్నారు.

2003-04లో ఎయిర్ లోకి వచ్చిన టీవీ9 తెలుగు జర్నలిజంలో సరికొత్త పోకడలను తీసుకొచ్చింది. క్రైం వార్తలకు కాదు..రాజకీయ వార్తలకు కూడా సరి కిత్త భాష్యం చెప్పింది. కాని..శ్రీనిరాజు యజమానిగా ఉన్నంత కాలం రవి ప్రకాశ్ అనుకున్నట్లే జరిగింది. ఆయన తీసుకుందే నిర్ణయం..ఆయన రాసిందే స్క్రిప్ట్. కాని..శ్రీనిరాజు వెళ్లిపోయి..అలందా యాజమాన్యం రావడంతో రవి ప్రకాశ్ స్పీడ్‌కు, స్క్రిప్ట్‌కు బ్రేక్‌ పడింది. జర్నలిజంలో రవి ప్రకాశ్‌ను మెచ్చుకునే వారు ఉన్నట్లే…తీవ్రంగా విమర్శించే వారు కూడా ఉన్నారు.

కొన్ని రోజులు జైల్లో కూడా ఉన్నారు రవి ప్రకాశ్. జైల్లో ఉన్నప్పుడు రవి ప్రకాశ్‌ను పరామర్శించడానికి ఓ  నేత వెళ్లారు. వారిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు ఆ నేతతో రవి ప్రకాష్ “ఏముందండీ నన్నైతే కొత్త ఛానల్ పెట్టనీయరు. ఇప్పట్లో సాధ్యం కాదు. అందుకే..ఎటువంటి వివాదాల్లేని, అన్నీ ఉండీ గ్రోత్ లేని ఐ న్యూస్‌ను తీసుకుందామని అనుకుంటున్నాను”అని అన్నారట..!. సో..రవి ప్రకాశ్ మనసు ఇప్పుడు ఐ న్యూస్‌పై పడిందని ఈ మాటలతో అర్ధమవుతుంది.

అయితే.. రవి ప్రకాశ్ అనుకుంటున్నట్లుగా ఐ న్యూస్‌లోకి రాగలరా..? నేను ఎందుకు ఈ ప్రశ్న వేస్తున్నానంటే..ఐ న్యూస్‌లో శ్రవణ్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. పైగా వెలమ. ఇంతేకాదు..సీఎం కేసీఆర్‌కు చుట్టం కూడా అని మీడియా వర్గాల్లో టాక్‌. అంతేకాదు..ఐ న్యూస్‌లో మాజీ సీఎం కిరణ్ కుమార్‌ రెడ్డి కుటుంబానికి కూడా షేర్లు ఉన్నాయంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో వీరు రవి ప్రకాశ్‌ను ఐ న్యూస్‌లోకి రానిస్తారా..?. అనేది మిలియన్ డాలర్లు ప్రశ్న.

జైల్లో నుంచి వస్తున్నప్పుడు రవి ప్రకాశ్ నవ్వుతూ కనిపించారు. చాలా యాక్టివ్‌గా కూడా ఉన్నారు. ఆయన సహచర జర్నలిస్ట్‌లు స్వీట్లు కూడా పంచుకున్నారు. అయితే..ఆయన చుట్టూ ఉన్న కొంతమందితోనే ఆయనకు ఇబ్బందులని జర్నలిస్ట్ సర్కిల్స్ లో మాట్లాడుకుంటున్నారు. ఆయన పేరుతో బాగానే కూడబెట్టుకున్నారని..ఇంకా ఆయన వారినే నమ్ముతున్నారని ..ఎప్పటికైనా ఇది దెబ్బేని చాలా మంది అభిప్రాయం.

రవి ప్రకాశ్‌ను అందరూ మీడియా మొఘల్ అంటారు. కాని…నాకు రవిప్రకాశ్‌లో మొఘల్ చక్రవర్తి బాబర్ కుమారుడు హుమాయున్ కనిపిస్తున్నాడు. ఎందుకంటే…బాబర్ 1526లో జరిగిన మొదటి పానిపట్టు యుద్ధంలో గెలిచి..కుమారుడి హుమాయున్‌కు విశాలమైన సామ్రాజ్యాన్ని ఇచ్చి చనిపోయాడు. తరువాత హుమాయున్‌ ను శత్రువులు చుట్టి ముట్టి పారదోలి రాజ్యాన్ని ఆక్రమిస్తారు. తరువాత మళ్లీ అనేక యుద్ధాలు తరువాత..హుమాయున్ తన సామ్రాజ్యాన్ని తిరిగి పొందుతాడు. రవి ప్రకాశ్ కూడా హుమాయున్‌ల తన సామ్రాజ్యాన్ని తిరిగి పొందుతారా..? కొత్త సామ్రాజ్యాన్ని నిర్మిస్తారా?. ఈ రెండు ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

  • వై.వి.రెడ్డి, న్యూస్ ఎడిటర్, న్యూస్ మీటర్

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.