పబ్ లో 'రేవ్ పార్టీ' వెనుక ఉన్న నిజాలను బయటపెట్టిన 'డీసీపీ'

By సుభాష్  Published on  17 Jan 2020 2:19 PM GMT
పబ్ లో రేవ్ పార్టీ వెనుక ఉన్న నిజాలను బయటపెట్టిన డీసీపీ

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ లో ఆదివారం ఓ పబ్‌లో రేవ్‌ పార్టీ నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి వెస్ట్‌ జోన్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈనెల 12న ఓ పబ్‌లో అమ్మాయిలతో డ్యాన్స్‌ లు చేయిస్తున్నారని సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించామని తెలిపారు. నిర్వాహకులు ఈ పబ్‌లో అసభ్యకరమైన నృత్యాలు చేయిస్తున్నట్లు చెప్పారు. పబ్‌లో డ్యాన్స్‌ లు మొదలయ్యే సమయంలో పోలీసులతో వెళ్లి దాడులు నిర్వహించినట్లు తెలిపారు. పోలీసుల రాకను చూసి కొందరు పరార్‌ కాగా, 21 మంది అమ్మాయిలను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్‌ నిర్వహించి వదిలేశామని చెప్పారు.

ఈ రేవ్‌ పార్టీలో ముగ్గురిని అరెస్ట్‌ చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు డీసీపీ చెప్పారు. సిగ్నోవా కంపెనీకి చెందిన వారే ఈ రేవ్‌ పార్టీ నిర్వహించేందుకు ప్లాన్‌ చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో శ్రీనివాస్‌రెడ్డి, మహమ్మద్‌ మొని, బుర్రి ప్రసాద్‌ గౌడ్‌లను అరెస్టు చేశామని, ఇంకా పబ్‌ యజమాని సంతోష్‌ రెడ్డి, మేనేజర్‌ భరత్‌లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారిని కూడా త్వరలో పట్టుకుంటామన్నారు. వ్యాపారాలు పెంచుకోవడం, సిగ్నోవా కస్టమర్లను సంతోష పర్చడం కోసమే ఈ రేవ్‌ పార్టీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే బేగంపేటలో ఉన్న లిస్బన్‌ పబ్‌పై కూడా చర్యలు తీసుకుంటామన్నారు.

పబ్‌లో ఏం జరిగినా యజమానులే బాధ్యత వహించాలన్నారు. పబ్బుల్లో బౌన్సర్లు వ్యవహించే తీరుపై కూడా నిఘా ఉందని, వారికి ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నామన్నారు. ఇక వెస్ట్‌ జోన్‌లో హుక్కా సెంటర్లపై కూడా ఉక్కుపాదం మోపారు. గత ఏడాదితో పోలిస్టే ఈ ఏడాది హుక్కాను పూర్తిస్థాయిలో అరికట్టినట్లు చెప్పారు.

Next Story