వారికి రేషన్ ఇవ్వండి: సుప్రీం కోర్టు
By సుభాష్ Published on 22 Sep 2020 10:03 AM GMTకరోనా మహమ్మారి అందరి జీవితాలపై కోలుకోలేని దెబ్బ కొట్టింది. కరోనా కారణంగా ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ కరోనా ప్రభావం సెక్స్ వర్కర్లపై కూడా పడింది. ఇదే జీవనాధారంగా బతుకుతున్న లక్షలాది మంది రోడ్డున పడ్డారు. వీరిలో రేషన్ కార్డులు కూడా ఉండనివారు కూడా ఎందరో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం రేషన్ బియ్యానికి కూడా నోచుకోలేకపోతున్నారని, అలాంటి వారికి న్యాయం చేయాలంటూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌పై మంగళవారం జస్టిస్ ఎల్‌ఎన్‌రావు, జస్టిస్ హేమంత్ గుప్తాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. రేషన్ కార్డు లేకపోవడాన్ని మానవ తప్పిదంగా పరిగణించి వారం రోజుల్లోగా వారికి అవసరమైన రేషన్ సరుకులను అందించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అలాగే జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం.. వారికి సాయం చేయాలని కేంద్రానికి సూచించింది సుప్రీం కోర్టు.
గత మార్చి 24 తర్వాత దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో సెక్స్ వర్కర్లు సైతం జీవనోపాధి కోల్పోయారని దుర్బార్ మహిళా సమన్వయ కమిటీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కరోనా కారణంగా వారు అప్పులు తీసుకొచ్చి బతుకు బండిని నెట్టుకొస్తున్నారని, వారికి న్యాయం జరగాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. కాగా, ప్రస్తుతం ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కేవలం 52 శాతం మంది సెక్స్ వర్కర్లకు మాత్రమే రేషన్ సదుపాయం ఉన్నట్లు సీనియర్ అడ్వకేట్ ఆనంద్ గ్రోవర్ తెలిపారు.