చిచ్చ‌ర పిడుగు 'ర‌షీద్ ఖాన్' విధ్వంసం.. 18 బంతుల్లోనే..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Jan 2020 8:28 PM IST
చిచ్చ‌ర పిడుగు ర‌షీద్ ఖాన్ విధ్వంసం.. 18 బంతుల్లోనే..

అఫ్గానిస్థాన్ యువ సంచ‌ల‌నం ర‌షీద్ ఖాన్ విధ్వంసం సృష్టించాడు. ఆస్ట్రేలియా దేశ‌వాళి లీగ్ బిగ్‌బాష్ లీగ్‌ (బీబీఎల్‌)లో లీగ్‌లో తన ప్రతాపం చూపించాడు. బిగ్‌బాష్‌ లీగ్‌లో భాగంగా అడిలైడ్ స్ట్రైకర్స్, సిడ్నీ థండర్స్‌ జట్ల మధ్య మంగళవారం మ్యాచ్ జరిగింది. మొదటగా బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్‌ 168 పరుగులు చేసింది.

169 ప‌రుగుల‌ లక్ష్య ఛేదనతో బ‌రిలోకి దిగిన‌ స్ట్రైకర్స్ జట్టు బ్యాట్స్‌మెన్ విఫ‌ల‌మ‌వ‌డంతో క‌ష్టాల్లో ప‌డింది. విజయానికి చివరి 21 బంతుల్లో 46 పరుగులు కావాలి. ఈ దశలో క్రీజులోకి వచ్చిన రషీద్ ఖాన్ మెరుపులు మెరిపించాడు. పోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డ్డాడు. కేవ‌లం 18 బంతుల్లో 40( 4x4, 3x6) పరుగులు చేశాడు.

సిడ్నీ థండర్స్ బౌల‌ర్స్‌ గ్రీన్, మోరీస్ ల‌కు స్వీప్, హుక్ షాట్స్‌తో చుక్క‌లు చూపించాడు. రషీద్ మ్యాచ్‌ను సునాయాసంగా గెలిపించేలా కనిపించాడు. కానీ విజయానికి 2 బంతుల్లో 5 పరుగులు చేయాల్సిన దశలో రషీద్ రనౌట్ అయ్యాడు. దీంతో స్ట్రైకర్స్ జ‌ట్టు విజ‌యానికి ముందు చ‌తికిల‌ప‌డింది.

కేవలం 3 పరుగుల తేడాతో స్ట్రైకర్స్ ఓటమిపాలవ్వడంతో రషీద్ పోరాటం వృథా అయ్యింది. అయితే రషీద్ బీభ‌త్స‌మైన‌ ఇన్నింగ్స్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ర‌షీద్ మెరుపు ఇన్నింగ్స్‌కు సంబందించిన వీడియోను స్ట్రైకర్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తుంది.



Next Story