నల్గొండ విద్యార్థికి అరుదైన వ్యాధి.. వైద్యులు ఏం చేశారంటే..

By అంజి  Published on  19 Feb 2020 9:05 AM GMT
నల్గొండ విద్యార్థికి అరుదైన వ్యాధి.. వైద్యులు ఏం చేశారంటే..

నల్గొండ జిల్లాలో ఓ విద్యార్థికి అరుదైన వ్యాధి వచ్చింది. నిత్యం ముఖం, చెంపలు, చేతులు, కాళ్ల మీద నుంచి రక్తం కారేది. దీంతో ఆ విద్యార్థి తీవ్రంగా బాధపడేవాడు. లక్షల మందిలో ఒకరికి వచ్చే హెమటైడ్రోసిస్‌ వ్యాధితో ఆ విద్యార్థి బాధపడుతున్నాడని నల్గొండ జిల్లా ప్రభుత్వ వైద్యులు గుర్తించారు. జిల్లా మెడికల్‌ కాలేజీ జనరల్‌ ఆస్పత్రి వైద్యలు చేసిన చికిత్సతో బాధితుడు కోలుకున్నాడు.

మాడుగులపల్లి మండలం పోరెడ్డిగూడేంలో వి.వెంకట్‌రెడ్డి కుటుంబం నివసిస్తూ ఉండేది. అతడికి శంకర్‌ రెడ్డి అనే పదకొండు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. ఆ విద్యార్థి 2017 నుంచి వింత వ్యాధితో బాధపడుతున్నాడు. మనిషికి చెమటలు కారినట్టే.. ఆ విద్యార్థికి రక్తం కారేది. ఇది చూసిన అతని తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. నిత్యం ఇలా 15 సార్లు రక్తం బయటకు కారేదని విద్యార్థి తండ్రి చెప్పారు. విద్యార్థిని ఈ వ్యాధి నుంచి బయటపడేసేందుకు అతడి తండ్రి హైదరాబాద్‌లోని పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చూపించాడు. రూ.లక్షలు ఖర్చు చేశాడు.. అయినా ఆ విద్యార్థికి వచ్చిన వ్యాధిని వైద్యులు నయం చేయలేకపోయారు.

జరిగిన విషయాన్ని తన గ్రామానికి చెందిన జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డాక్టర్‌ సురేశ్‌రెడ్డికి విద్యార్థి తండ్రి వెంకట్‌రెడ్డి వివరించాడు. తన కుమారుడు అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడని.. అతడి దగ్గర వాపోయాడు. దీంతో విద్యార్థి శంకర్‌రెడ్డికి జిల్లా ఆస్పత్రిలో పలు రకాల పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుత రిపోర్టులను, గత రిపోర్టులను పోల్చి పరిశీలించారు. అనంతరం ఇంటర్నెట్‌లో వైద్యరంగానికి సంబంధించిన లిటరసీలో ఈ వ్యాధి గురించి జిల్లా వైద్యులు తెలుసుకున్నారు.

శంకర్‌రెడ్డి హెమటైడ్రోసిస్‌తో బాధపడుతున్నాడని డాక్టర్‌ సురేశ్‌ రెడ్డి గుర్తించాడు. ఆ తర్వాత అదే ఆస్పత్రిలో శంకర్‌రెడ్డిని ఇన్‌పేషంట్‌గా చేర్చుకొని చికిత్స ప్రారంభించారు. కొన్ని రోజుల తర్వాత అతడు వ్యాధి నుంచి కోలుకుంటన్నట్లు గుర్తించిన వైద్యులు.. అతడిని అవుట్‌ పెషేంట్‌గా మార్చారు. ప్రస్తుతం ఆ విద్యార్థి వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నాడు. దీంతో అతని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Next Story
Share it