రఫెల్‌ను నడిపే తొలి మహిళా పైలట్ ఎవరంటే..?
By తోట వంశీ కుమార్ Published on 23 Sept 2020 5:06 PM ISTభారత వాయుసేన (ఐఏఎఫ్) అంబులపొదిలోకి చేరిన అత్యాధునిక రఫేల్ ఫైటర్ జెట్ నడిపే తొలి మహిళా పైలట్ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపే తొలి మహిళా పైలట్‌గా ఫ్లైట్ లెఫ్టినెంట్ శివంగి సింగ్ ఎంపికయ్యారు. ఫ్రాన్సులో తయారైన 5 రఫేల్ ఫైటర్ జెట్లు ఈనెల 10న అంబాలా వైమానిక స్థావరం కేంద్రంగా పనిచేస్తున్న గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్‌లో అధికారికంగా చేరిన విషయం తెలిసిందే. త్వరలో అంబాలాలోని 17 స్క్వాడ్రన్‌కు చెందిన రాఫెల్ ‘గోల్డెన్ యారోస్’లో భాగం కానున్నారు. దీని కోసం ఆమె ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
వారణాసికి చెందిన శివంగి సింగ్.. చిన్ననాటి నుంచే వైమానిక దళంలో చేరాలని కలలు కనేవారు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో చేరిన అనంతరం తన ఆశయాన్ని నెరవేర్చుకునే దిశగా అడుగులుపడ్డాయి. అక్కడే నేషనల్ క్యాడెట్ కార్స్ప్ 7 యూపీ ఎయిర్ స్వాడ్రాన్‌లో భాగస్వామ్యమయ్యే అవకాశం లభించింది. ఈ క్రమంలో 2016లో ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో చేరి శిక్షణ ప్రారంభించారు. 2017లో భారత వైమానిక దళంలో చేరారు. మిగ్-21 బైసన్ యుద్ధ విమానాలు నడిపిన అనుభవం ఆమె సొంతం. గత ఏడాది ఫిబ్రవరిలో పాకిస్థాన్‌కు చెందిన యుద్ధ విమానం కూల్చివేసిన సందర్భంగా ఆ దేశ చెరలో కొన్ని రోజులపాటు ఉన్న వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌తో కలిసి ఫైటర్ జెట్లు నడిపిన శివాంగి త్వరలోనే రఫేల్ స్క్వాడ్రన్‌లో చేరేందుకు అంబాలాలో అడుగుపెట్టనున్నారు.
రాఫెల్ యుద్ద విమానాలను నడిపేందుకు మహిళా పైలట్ల పేర్లను కేంద్రం పరిశీలిస్తున్నట్లు కథనాలు వచ్చిన రెండు రోజులకే శివంగి సింగ్ పేరు ఖరారు కావడం గమనార్హం. కాగా,రక్షణ రంగంలో యుద్ద విమానాల పైలట్లుగా మహిళలకు అవకాశం కల్పిస్తూ మోదీ సర్కార్ 2015లో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.