ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు(పబ్లిక్‌ పాలసీ) పదవికి ప్రముఖ జర్నలిస్ట్ రామచంద్రమూర్తి రాజీనామా చేశారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లంను కలిసి తన రాజీనామా సమర్పించారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. గతేడాది నవంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను పబ్లిక్‌ పాలసీ సలహాదారుగా నియమించింది. నిజానికి రామచంద్రమూర్తి నాలుగైదు నెలల కిందటే రాజీనామా చేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ అప్పట్లో సైలెంటయిపోయారు. రామచంద్రమూర్తితో పాటు ప్రభుత్వంలో ఇప్పటికి 33 మంది సలహాదారులను నియమించారు. వీరిలో పది మందికి కేబినెట్‌ హోదా కూడా ఉంది.

కె.రామచంద్రమూర్తి అత్యంత సీనియర్‌ జర్నలిస్టు. ఉదయం, వార్త, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలకు ప్రధాన సంపాదకులుగా పని చేశారు. సాక్షి మీడియా గ్రూప్‌కు ఎడిటోరియల్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతేడాది నవంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను పబ్లిక్‌ పాలసీ సలహాదారుగా నియమించింది. సచివాలయంలోని ఐదో బ్లాక్‌లో ఆయనకు ఛాంబర్‌ను కేటాయించారు. విధానపరమైన అంశాల్లో ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందుకు, అధ్యయనం చేసేందుకు నియమించినప్పటికీ ఆయన వద్దకు ఇప్పటి వరకు ఒక్క ఫైల్‌ కూడా రాకపోవడంతోనే రాజీనామా చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.

తోట‌ వంశీ కుమార్‌

Next Story